- మూడేండ్లలో 1,69,235 వాహనాల అమ్మకం
- నెలకు టూవీలర్లు 1,200, ఆటోలు 400,
- కార్లు 1,500 సేల్.. ఇతర వెహికల్స్300 మాత్రమే
- ఈవీ పాలసీతో వెహికల్స్ విక్రయాల్లో జోష్
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్పరిధిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) అమ్మకాల జోరు పెరిగింది. నగరంలో పెరుగుతున్న జనాభాకు తోడు వ్యాపారాలు సాఫ్ట్వేర్సంస్థలు పెరగడం.. ఉద్యోగాల్లో వృద్ధితో వాహనాలు కొనేవారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీ (ఈవీ) తీసుకువచ్చాక ఈవీ అమ్మకాల్లో జోష్ కనిపిస్తున్నది.
పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న ఈవీ కొత్త పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఈవీ వాహనాలకు రోడ్డు ట్యాక్స్‌తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును రవాణాశాఖ పూర్తిగా మినహాయించింది. ఈ పాలసీ కింద పలు రాయితీలు ఇస్తున్నది.
దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లు పుంజుకుంటున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. నిరుడితో పోలిస్తే సేల్స్ బాగా పెరిగాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ‘వాహన్సారథి’ని అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో అమ్మకాలు మరింతగా పెరిగే చాన్స్ ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
సేల్ అవుతున్న వెహికల్స్‌లో సగం ఈవీలే
ఎలక్ర్టిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు వీటివైపు మొగ్గుచూపుతున్నారు. నిరుడు 90 నుంచి 95 వేల ఈవీలు అమ్ముడపోగా.. ఈసారి డిసెంబర్‌నాటికి దాదాపు 48 శాతం పెరుగుదల ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 2021 ఫిబ్రవరి నుంచి 2024 డిసెంబర్ ఆఖరు నాటికి నగరంలో 1,69,235 వాహనాలు సేల్ అయినట్టు వివరించారు.
ALSO READ : హోండా, నిస్సాన్ విలీనం.. చైనాను దెబ్బకొట్టేందుకు ఎత్తుగడ.. మూడో అతిపెద్ద ఆటోకంపెనీగా అవతారం
ఆయా వాహనాల విషయానికి వస్తే టూవీలర్ వాహనాలు నెలకు 1200 సేల్ అవ్వగా.. ఆటోలు 360 నుంచి 400 , కార్లు 1200 నుంచి 1500 వరకు అమ్ముడుపోయాయని వెల్లడించారు. ఇక ఇతర వాహనాలు నెలకు దాదాపు 300 వరకు సేల్ అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి దాదాపు 82 లక్షల వరకు ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు వివరించారు. తాజాగా ఈవీ పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగినట్టు తెలిపారు. వచ్చే ఏడాదికి గ్రేటర్ పరిధిలో 50 శాతానికి మించి ఎలక్ట్రిక్ వెహికల్స్ నగర రోడ్ల మీదుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
త్వరలో ఈవీ ఆటోలకు పర్మిట్లు
హైదరాబాద్నగరంలో కొత్త ఆటోల నిషేధం ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అధికారులు రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీ ఇస్తున్నారు. 2026 డిసెంబర్ వరకూ టాక్స్‌లో మినహాయింపు ఉండడంతో నగరంలో ఈవీ ఆటోలను నడుపుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. ఈవీ ఆటో కొనాలంటే పాత ఆటోను స్ర్కాప్ చేయాలని, ఆర్టీఏ ఇచ్చే పర్మిట్లను చూపించి ఆటో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
అయితే, ఈవీ పాలసీ అమల్లోకి తెచ్చిన అధికారులు కొత్త ఆటోల కొనుగోలుకు మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోగా.. ఈ విషయం పై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నదని తెలిపారు. త్వరలోనే ఈవీ ఆటోలకు పర్మిట్లను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు.