రూ. 18 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డివిజనల్ ఇంజినీర్

ఎల్​బీనగర్,వెలుగు:  విద్యుత్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఆటోనగర్ డివిజనల్ ఇంజినీర్(టెక్నికల్) ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.  ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారానికి  చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ బొల్లారం బాలనర్సింహ రంగారెడ్డి జిల్లా మంచాల పరిధిలో ఓ వెంచర్ లోని 11 కేవీ, 33 కేవీ విద్యుత్ లైన్లు మార్చి.. ఒకే ట్రాన్స్ ఫార్మర్ కు పెట్టేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. 

కాంట్రాక్టర్ వెంచర్ యజమాని తరపున ఫైల్ ను ఆటోనగర్ లోని సరూర్ నగర్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆఫీసులో కొద్దిరోజుల కిందట అందజేశాడు. డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్) రామ్మోహన్ ఫైల్ ను తన వద్ద పెట్టుకుని కాంట్రాక్టర్ ను రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ. 18వేలు ఇస్తానని ఒప్పుకుని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు డీఈ రామ్మోహన్ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వెళ్లి పట్టుకున్నారు. ఓ ఉన్నతాధికారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంట్రాక్టర్ బాలనర్సింహ కొందరు లంచగొండి ఆఫీసర్లను ఏసీబీకి పట్టించినట్లు తెలిసింది.