- కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి..
- గ్రేటర్ వరంగల్ కేంద్రంగా నకిలీ ఎలక్ట్రికల్ సామగ్రి దందా
- బ్రాండెడ్ పేర్లతో నకిలీ వైర్లు, ఇతర సామాన్లు అంటగడుతున్న వ్యాపారులు
- కొత్తగా నిర్మించే ఇండ్లను టార్గెట్ చేసి బిజినెస్
- నగరంలో రూ.50 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
హనుమకొండ, వెలుగు: వరంగల్ కేంద్రంగా ఎలక్ట్రికల్ సామగ్రి దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఏటా పెద్ద సంఖ్యలో బిల్డింగ్స్ నిర్మాణం అవుతుండటం, ఇతర ఇండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. బ్రాండెడ్ కంపెనీల ముసుగులో డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ జనాల కొంప ముంచుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయా కంపెనీల ప్రతినిధులు ఇటీవల వరంగల్ నగరంలోని మూడు స్టేషన్లలో ఫిర్యాదు చేయగా, పోలీసులు పెద్ద మొత్తంలో డూప్లికేట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, తనిఖీల విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు షాపులు క్లోజ్ చేసి ఉంచుతున్నట్లు తెలిసింది. రాజస్థాన్ నుంచి వచ్చిన కొందరు వ్యాపారులు ఈ అక్రమ దందాకు తెర లేపారని, క్వాలిటీ లేని ఎలక్ట్రికల్ వస్తువులే ఫైర్ యాక్సిడెంట్లు కారణమవుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ఏటా రూ.కోట్లలో దందా..
ఉమ్మడి జిల్లాలో ఏ బిజినెస్ అయినా వరంగల్ సిటీ కేంద్రంగానే సాగుతుంటుంది. ఇందులో ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ బిజినెస్ కూడా ఒకటి. నగరంలో దాదాపు 300కుపైగా ఎలక్ట్రికల్ షాపులు ఉండగా, ఇక్కడి నుంచే ఉమ్మడి జిల్లాకు సామగ్రి సరఫరా అవుతుంటుంది. మార్కెట్లో పాలీక్యాబ్, ఫినోలెక్స్, గోల్డ్మెడల్, వీ గార్డ్, యాంకర్, డ్యూరాస్టెప్, పానసోనిక్ తదితర కంపెనీలకు సంబంధించిన వైర్లు, స్విచ్ లు, బ్రేకర్స్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లు, లైటింగ్స్ తదితర ఎలక్ట్రికల్ వస్తువులకు డిమాండ్ ఉంది.
దీంతో నగరంలోని కొందరు వ్యాపారులు ఆయా కంపెనీల పేరుతో అక్రమ దందాకు తెరలేపారు. హైదరాబాద్లోని కొందరు అక్రమార్కులతో చేతులు కలిపి బ్రాండెడ్ పేర్లతో ఉన్న డూప్లికేట్ఎలక్ట్రికల్ సామగ్రిని తీసుకొచ్చి జనాలకు అమ్మేస్తున్నారు. క్వాలిటీ లేకపోవడం, కరెంట్సరఫరాను తట్టుకోలేక వైర్లు కాలిపోయి తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా, ఏటా రూ.కోట్లలో నష్టం జరుగుతోంది.
కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో వెలుగులోకి..
నగరంలో కాపీ రైట్యాక్ట్ను ఉల్లంఘించి బ్రాండెడ్ కంపెనీల పేరుతో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వస్తువుల దందా చేస్తున్నారనే సమాచారంతో గత సెప్టెంబర్ తోపాటు ఇటీవల ఆయా కంపెనీల ప్రతినిధులు పట్టణంలోని పలు షాపులను పరిశీలించారు. అందులో వారి కంపెనీలకు సంబంధించిన డూప్లికేట్ ఎలక్ట్రికల్ సామగ్రి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు వరంగల్అండర్ బ్రిడ్జి ఏరియాలోని శ్రీపార్వతీ ఎలక్ట్రికల్స్ పై మిల్స్ కాలనీ పీఎస్లో ఫిర్యాదు చేశారు.
పెగడపల్లి డబ్బాల సమీపంలోని సాయి గణేశ్ ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీ, శివ్ ఎలక్ట్రికల్స్ షాపులపై కేయూ పీఎస్లో, హనుమాన్ నగర్శ్రీఅరబిందా ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీ షాపుపై హనుమకొండ స్టేషన్ లో కంప్లైంట్ఇచ్చారు. దీంతో ఈ నాలుగు షాపుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు వైర్లు, స్విచ్లు, బ్రేకర్లు, తదితర రూ.49.67 లక్షల విలువైన డూప్లికేట్ ఎలక్ట్రికల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కొన్ని షాపులు బంద్..!
కంపెనీల ప్రతినిధుల ఫిర్యాదుతో ఇటీవల నాలుగు షాపులపై కేసులు నమోదు కాగా, ట్రై సిటీలోని మరికొందరు వ్యాపారులు కూడా ఇదే దందా కొనసాగిస్తుండగా, వారు అలర్ట్ అయినట్లు తెలిసింది. దీంతో షాపులను రోజులో ఎక్కువశాతం క్లోజ్ చేసే ఉంచుతున్నట్లు సమాచారం. క్వాలిటీ లేని వస్తువులను అంటగడుతూ అక్రమ దందాకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.