జూనియర్​ అకౌంట్స్​ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయాలి

 

  • విద్యుత్​ అకౌంట్​ ఆఫీసర్ల​ అసోసియేషన్ డిమాండ్​ 
  • ప్రమోషన్లు కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎంకు సంఘం కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు: గత ఆరేండ్లుగా విద్యుత్​ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్​ అకౌంట్స్​ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయాలని విద్యుత్​ అకౌంట్స్​ ఆఫీసర్ల​ అసోసియేషన్​ డిమాండ్​ చేసింది. శుక్రవారం హైదరాబాద్  మింట్​కాంపౌండ్​లోని వీఏవోఏ భవన్​లో జరిగిన సమావేశంలో  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య మాట్లాడారు. 2018 నుంచి ఇప్పటి వరకు విద్యుత్​ సంస్థల్లో  200 జూనియర్   అకౌంట్స్  ఆఫీసర్  పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

వాటిని భర్తీచేసి బీకాం గ్రాడ్యుయేట్  విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. 2004 నాటికి  విధుల్లో ఉన్న విద్యుత్  ఉద్యోగులను జీపీఎఫ్  పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఇక, సీఎం రేవంత్  రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో డిపార్ట్ మెంట్ లో ఉద్యోగులకు ప్రమోషన్లు  లభించాయని ఆయన హర్షం వెలిబుచ్చారు. అకౌంట్స్​ ఆఫీసర్ల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు  తెలిపారు.

ప్రమోషన్లు కల్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న సదరన్  ​ డిస్కం సీఎండీ ముషారఫ్  ఫారుకీ,  నార్తర్న్​ డిస్కం సీఎండీ వరుణ్ రెడ్డి, జెన్​కో జేఎండీ శ్రీనివాస్ రావుకూ  ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్  అకౌంట్స్  ఆఫీసర్స్  అసోసియేషన్  2025 డైరీని జెన్​కో ఫైనాన్స్​ డైరెక్టర్​ అనురాధ, నార్తర్న్​ డిస్కం ఫైనాన్స్​ డైరెక్టర్ ​ తిరుపతిరెడ్డి, సదరన్​ డిస్కం హెచ్ఆర్​ డైరెక్టర్​ సుధామాధురి, వీఏఓఏ అధ్యక్షుడు అశోక్​ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెండు డిస్కంల పరిధిలోని అకౌంట్స్​ అధికారులు పాల్గొన్నారు.