
ఉప్పల్, వెలుగు: తాళం వేసి ఉన్న ఇంటికి రూ.7 లక్షల కరెంట్ బిల్లు వేశారు విద్యుత్ శాఖ అధికారులు. హైదరాబాద్లోని ఉప్పల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ హైకోర్టు కాలనీలో పాశం శ్రీదేవి అనే మహిళకు రెండంతస్తుల డబుల్ బెడ్రూం ఇల్లు ఉంది. పై అంతస్తులో ఆమె తల్లిదండ్రులు ఉంటున్నారు. కింది పోర్షన్ కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది. దీంతో నెలకు రూ.150 నుంచి రూ.250 మధ్య వచ్చే కరెంట్ బిల్లు వచ్చేది. కానీ, ఈ నెల ఏకంగా రూ.7,97,576 బిల్లు వచ్చింది. దీంతో బిల్లును చూసిన బిల్డింగ్ యజమానురాలు షాక్కు గురైంది.
వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించింది. మీటర్లో లోపం ఉందని, మీటర్జంప్వల్ల ఇంత బిల్లు వచ్చిందని, వెంటనే మార్చుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. దాంతో మీటరు మార్చాలని ఉప్పల్లోని కరెంటు ఆఫీసుకు వెళ్లగా, ఇక్కడ కాదని ఎన్ఎఫ్సీ వద్ద ఉన్న ఆఫీసుకు వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లగా డీడీ తీయాలని చెప్పారు. డీడీ తీసి అందజేయగా వివరాలన్నీ నమోదుచేసుకుని ఒక రశీదు ఇచ్చి ఉప్పల్వెళ్లి అక్కడ మీటర్ మార్చుకోవాలని సూచించారు. దీంతో మళ్లీ ఉప్పల్ఆఫీసుకు రాగా.. దాదాపు నాలుగు గంటలు కూర్చోబెట్టుకొని కొత్తమీటరు ఇచ్చారని శ్రీదేవి తల్లి ఆండాలమ్మ చెప్పారు.