- ప్రభుత్వ ఆఫీసుల నుంచి రావాల్సిన బిల్లులే రూ.302 కోట్లు
- సబ్సీడీ ద్వారా సర్కార్ కట్టాల్సిన బకాయిలు రూ.45 కోట్లు
- నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించాని వైనం
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) లో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు పేరుకుపోయాయి. నూతన పాలక వర్గం ఏర్పడినప్పుడు వంద శాతం బకాయిలు వసూలు చేస్తామని చెప్పారు. నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బకాయిల వసూళ్లకు కార్యాచరణ రూపొందించ లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు పేరుకుపోయాయి. సెస్ అధికారులు ఎన్ని నోటీసులు పంపించినా బకాయిలు వసూలు కావడం లేదు.
ఓటు కట్ చేసినా ఫాయిదా లేదు
గత సంవత్సరం సెస్ ఎన్నికలు నిర్వహించినప్పుడు బకాయిలు ఉన్న వినియోగదారుల ఓటు హక్కు కట్ చేశారు. ఓటు హక్కు కట్ చేసినా వినియోగదారుల నుంచి పెద్దగా బకాయిలు వసూలు కాలేవు. వినియోగదారులకు ఓటు హక్కు కట్ చేసి నెల రోజులు సమయం ఇచ్చారు. అయినాబకాయిలు వసూలు చేయలేకపోయారు. దీంతో సెస్ లో 38 వేల మంది ఓటు హక్కును కోల్పోయారు. గత సంవత్సరం సెస్ ఎన్నికలకు ముందు 2.91లక్ష ల కనెక్షన్ ఉండగా బకాయి ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీస్ లు జారీ చేశారు.
పేరుకుపోయిన రూ. 256 కోట్ల బకాయిలు
గ్రామపంచాయతీల వాటర్ వర్స్క్ స్ట్రీట్ లైట్స్ బకాయిలు రూ.164.94 కోట్లు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల నుంచి రెండు కోట్ల రూపాయలు రావాల్సినవి ఉన్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ. 3.07 కోట్లు, ప్రభుత్వం అందించే పవర్లూం సబ్సిడీ కి సంబంధించి రూ. 42.01 కోట్లు, మొత్తం రూ. 256 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ బకాయిలు 45 కోట్లు సెస్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు రూ. 45 కోట్ల వరకు ఉన్నాయి. విద్యుత్ బిల్లులకు సంబంధించి పవర్లూం సబ్సిడీ రూ.42 కోట్లు, ఎస్సీ ఎస్టీ 101 యూనిట్స్ కు సంబంధించి రూ.5 కోట్లు బకాయిలు ఇటీవల విడుదల చేశారు. పవర్ లూం కు సంబంధించి వినియోగదారుడు యూనిట్ రెండు రూపాయలు చెల్లిస్తాడు. ప్రతి యూనిట్ కు ప్రభుత్వం రెండు రూపాయలు సబ్సిడీగా ఇస్తుంది. ఇందులో వినియోగదారుడి నుంచి విద్యుత్ బిల్లులు వసూలవుతున్నా ప్రభుత్వం తన వాటా మాత్రం కట్టడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ను కట్ చేసేంత సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది.వపర్లూం సబ్సీడీకి సంబందించిన రూ. 42 కోట్లు ప్రభుత్వం విడుదలకు సెస్ ఎదురుచూస్తోంది.
వినియోగదారుల బకాయిలు రూ. 65 కోట్లు
సెస్ లో వినియోగదారుల బకాయిలు రూ.65 కోట్లుకు చేరుకున్నాయి. సెస్ పరిధిలో 255 గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ రెండు పట్టణాలు, 2.54 లక్షల వినియోగదారులు ఉన్నారు. ఇందులో ప్రతి నెల 1.60 లక్షల మంది వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లిస్తారు. వినియోగదారుల నుంచి ప్రతి నెల రూ. 14.70 కోట్లు వసూలవుతాయి. సెస్ పరిధిలో 372 మంది సిబ్బంది పని చేస్తారు. వీరికి ప్రతి నెల సుమారు రూ. 2.50 కోట్ల జీతాలు చెల్లిస్తారు.
ప్రభుత్వ బకాయిలు పేరుకుపోతున్నాయి.
వినియోగదారులు బకాయిలు చెల్లించకుంటే వారి ఇంటి కరెంట్ కట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు కోట్లలో ఉంటే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు. బకాయి ఉన్న కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
–చిమ్మని ప్రకాష్ , రాజన్న సిరిసిల్ల జిల్లా, విద్యుత్ వినియోగదారులు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
వసూళ్లపై దృష్టి సారిస్తాం
వినియోగాదారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారిస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసులకు బకాయిల కట్టాల్సిందిగా నోటీసులు జారీ చేస్తున్నాం. ఏటా వారికి బడ్జెట్ రీలీజ్ అయినప్పుడు కొంత బకాయిని పే చేస్తున్నారు. ప్రతి ఆఫీస్ కు రెండు, మూడు పర్యాయాలు నోటిస్ అందజేస్తాం. తర్వాత బకాయిలు చెల్లించకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని బకాయిలు వసూలయ్యేలా చర్యలు చేపడతాం.
–సెస్ చైర్మన్ చిక్కాల రామారావు