పీక్స్​కు కరెంట్ డిమాండ్..తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం

పీక్స్​కు కరెంట్ డిమాండ్..తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం

 

  • 16,918 మెగావాట్లకు చేరిక
  • రోజూ 320 ఎంయూలకు పైగానే వాడకం
  • ఈసారి భారీగా పెరిగిన వరిసాగు.. సేద్యానికే అత్యధికంగా కరెంట్ 
  • ఇతర అన్ని రంగాల్లోనూ పెరుగుదల
  • మూడో వంతు కరెంట్ బయట నుంచే కొని సప్లై చేస్తున్న సర్కారు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ వినియోగం అత్యధికంగా పెరిగింది. విద్యుత్ ​డిమాండ్​లోనూ, వాడకంలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గురువారం ఏకంగా16,918 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడగా, 328.979 మిలియన్ యూనిట్ల(ఎంయూ) వినియోగం నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే కరెంట్ డిమాండ్, వినియోగంలో ఇదే సరికొత్త రికార్డ్ అని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో ఇండ్లలో కరెంట్ వినియోగం ఎక్కువైంది. ఈసారి వరి పంట అత్యధికంగా సాగు కావడంతో వ్యవసాయానికి కరెంట్ డిమాండ్ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. వ్యవసాయంతో పాటు ఇతర అన్ని రంగాల్లోనూ విద్యుత్ వినియోగం అధికమవడంతో ఈసారి కరెంట్ డిమాండ్, వాడకం రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయికి చేరిందని చెప్తున్నారు. 

పెరిగిన వరి సాగు, కరెంట్ వాడకం   

ఎండల తీవ్రతతో ఉక్కపోతలు పెరగడంతో జనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెంచారు. పట్టణ ప్రాంతాల్లో గృహ వినియోగంతో పాటు కమర్షియల్, ఇండస్ట్రియల్ రంగాల్లోనూ కరెంట్ వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్​కు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో సగటున 50 లక్షల ఎకరాలకు మించి సాగు జరగదు. అలాంటిది ఈసారి దాదాపు 73.65 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. అందులో 56.13 లక్షల ఎకరాల్లో వరి వేశారు. వరికి నీరు ఎక్కువ అవసరం కావడం, ఎండాకాలం కూడా కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల బోర్లు నిరంతరాయంగా నడుస్తున్నాయి. దీంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం అత్యధికంగా పెరిగిందని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. 

రోజూ16 వేల మెగావాట్లపైనే.. 

గడిచిన 20 రోజులుగా ప్రతిరోజూ 16 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ నమోదవుతోందని అధికారులు చెప్తున్నారు. గురువారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా16,918 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. అలాగే బుధవారం16,731,  మంగళవారం16,675, సోమవారం16,417, ఆదివారం16,169 మెగావాట్ల డిమాండ్ నమోదు అయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సగటున దాదాపు3 వేల మెగావాట్ల డిమాండ్ అధికంగా ఉంటోంది. అలాగే కరెంట్ వాడకంలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రోజూ 320 మిలియన్ యూనిట్లకు పైగా కరెంట్ వాడుతున్నారు. మంగళవారం 321.406, బుధవారం 324.384 ఎంయూల వినియోగం జరగగా, గురువారం 328.979 ఎంయూలతో కొత్త రికార్డు నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు రోజూ 20 ఎంయూల కంటే అధికంగా కరెంట్ వాడకం నమోదవుతోంది.  

బయట నుంచి కొని సరఫరా..

రాష్ట్రంలోని జెన్​కో థర్మల్, హైడల్​తో పాటు సింగరేణి మొత్తం కలిపి120 మిలియన్ యూనిట్ల వరకే కరెంట్ ఉత్పత్తి అవుతోంది. ఇది రాష్ట్ర అవసరాలకు సరిపోకపోవడంతో ప్రభుత్వం బయట రాష్ట్రాల నుంచి కరెంట్ కొనుగోలు చేసి సప్లై చేస్తోంది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల ద్వారా165 నుంచి185 ఎంయూలు, నాన్ కన్వెన్షన్ ఎనర్జీ సంస్థల ద్వారా 40 నుంచి 45 ఎంయూల కరెంట్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్​కో అధికారులు చెప్తున్నారు.