రోజుకు 35 మిలియన్ ​యూనిట్లు .. అదనంగా వాడుతున్రు!

  • ఖమ్మం జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈసారి పెరిగిన విద్యుత్​ వినియోగం 
  • మార్చి రెండో వారంలోనే ముదిరిన ఎండలు
  • ఫ్యాన్లు, ఏసీ, కూలర్లు వాడక తప్పట్లేదంటున్న జనం

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో విద్యుత్​ వినియోగం పెరిగింది. మార్చి రెండో వారంలోనే ఎండలు మండుతున్నాయి. దీంతో ఇండ్లలోఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకుండా ఉండలేని పరిస్థితి  నెలకొంది. వ్యవసాయానికి బోర్లు, బావుల్లో మోటార్ల వాడకం కూడా పెరిగింది. గతేడాదిలో మార్చి నెలతో పోల్చితే ఈ సారి రోజుకు 35 మిలియన్​యూనిట్ల విద్యుత్​ అదనంగా వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

40.5 డిగ్రీల టెపరేచర్..​

ఖమ్మం జిల్లాలోబుధవారం అత్యధికంగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో 40.5 డిగ్రీలు, తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, బచ్చోడులో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా అన్ని చోట్ల 37 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్​ఉంటోంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతకు తోడు, వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో మరింత ఉక్కపోతగా అనిపిస్తోంది. భూగర్భ జలాలు తగ్గడం, చెరువులల్లో నీళ్లు లేకపోవడం లాంటి కారణాలు ఉక్కపోతకు కారణంగా తెలుస్తున్నాయి.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా కొడుతోంది. దీంతో గతేడాది మార్చిలో రోజుకు 7.10 నుంచి 7.40 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ వాడకం ఉండగా, ఈసారి మాత్రం 7.50 నుంచి 7.95 మిలియన్​ యూనిట్లకు పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి. ఇక గత వారం రోజుల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్​ డిమాండ్​ పీక్​ స్టేజికి చేరుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

చెట్ల కింద సేద తీరుతున్రు.. 

ఎండల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్​ స్టూడెంట్స్​ పరీక్షలు జరుగుతుండడంతో మధ్యాహ్నం ఎగ్జామ్​ సెంటర్ల నుంచి ఇళ్లకు వచ్చేందుకు తిప్పలు పడుతున్నారు. రోడ్ల వెంబడి చెట్ల నీడకు సేదదీరుతున్నారు.