- వానాకాలంలోనూ కరెంట్‌కు ఫుల్ డిమాండ్
- ఈ నెలలో 15,570 మెగావాట్ల విద్యుత్ వినియోగం
- ఇప్పటివరకు వానాకాలం సీజన్‌లో ఇదే అత్యధిక డిమాండ్
- భారీగా వరి సాగు.. పెరిగిన విద్యుత్ వినియోగం
- గత పది నెలల్లోనే 4 లక్షల కొత్త కనెక్షన్లు
- యాసంగి మాదిరిగా 300 ఎంయూలు దాటిన వాడకం
- నిరుటి కంటే 40 ఎంయూలు ఎక్కువగానే వినియోగం
హైదరాబాద్, వెలుగు: ఇదేం మండు వేసవి కాదు. అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయినా, రాష్ట్రంలో కరెంట్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. వేసవికి దీటుగా గడిచిన రెండు నెలల్లో విద్యుత్ విని యోగం పీక్స్‌కు చేరింది. అగ్రికల్చర్లో కరెంట్ వినియోగం పెరగడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు అంటున్నారు. గత పది నెల్లలో రైతులు కొత్తగా 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం, ఈ సీజన్‌లో వరి సాగు కూడా రికార్డ్ స్థాయిలో పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. మొత్తం మీద వానాకాలంలోనూ విద్యుత్ డిమాండ్15 వేల మెగావాట్లు దాటుతున్నది. వరి కోతలు మొదలయ్యేదాకా ఈ పరిస్థితి ఉంటుందని, దసరా తర్వాత డిమాండ్ కొంతవరకు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు.
17 వేల మెగావాట్లకు చేరొచ్చు..
రాష్ట్రంలో ఈ సారి 65.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఏ సీజన్‌కైనా ఇప్పటివరకు వరిసాగులో ఇదే రికార్డు. నీటి సౌలభ్యం పెరగడంతో గతానికి భిన్నంగా మహబూబ్‌నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ వరి అత్యధికంగా సాగైంది. సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద ఈ సారి నీరు విడుదల చేయడం, భూగర్భ జలాలు పెరగడం వల్ల కూడా వరి సాగు పెరిగింది. మరోవైపు గడిచిన పది నెలల్లో 4 లక్షల వరకు కొత్త అగ్రికల్చర్ కరెంట్ కనెక్షన్లు పెరిగాయి. గతంలో 25 లక్షలున్న వ్యవసాయ కనెక్షన్లు ఇప్పుడు 29 లక్షలకు చేరాయి.
కెనాల్స్ ద్వారా వచ్చే నీటి కన్నా బోర్ల ద్వారానే ఎక్కువ పొలాలకు నీరు అందుతోంది. ఫలితంగానే కరెంటు డిమాండ్ పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులతోపాటు, ట్రాన్స్‌కో ఆఫీసర్లు చెప్తున్నారు. మొత్తంగా ఈ సీజన్ లో అగ్రికల్చర్ విద్యుత్ డిమాండ్ ఏకంగా15 వేల మెగావాట్ల మైలు రాయిని దాటుతోంది. ఈ నెల 20న 15,570 మెగావాట్లకు చేరింది. వానాకాలం సీజన్‌లో ఈ స్థాయి విద్యుత్ డిమాండ్ ఇదే మొదటిసారి. గతంలో యాసంగి సీజన్‌లో 2024 మార్చి 8న అత్యధికంగా పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లుగా నమోదైంది. వరి సాగు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత వానాకాలం సీజన్ లోనే విద్యుత్ డిమాండ్17 వేల మెగావాట్ల వరకు చేరే అవకాశాలు ఉన్నాయని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాదికి మించి కరెంటు వాడకం
రాష్ట్రంలో గత రెండు నెలలుగా కరెంట్ వినియోగం 300 మిలియన్ యూనిట్(ఎంయూ)ల మార్కు దాటుతోంది. ఈ నెల19న రాష్ట్రవ్యాప్తంగా 303.82 ఎంయూల వాడకం నమోదైంది. వానాకాలం సీజన్ ముగిసే నాటికి రికార్డ్ స్థాయిలో కరెంటు వాడకం నమోదు కావచ్చని చెప్తున్నారు. గత నెల 29న 304 ఎంయూల కరెంట్ వాడకం జరిగింది. లాస్ట్ఇయర్ తో పోలిస్తే.. 40 నుంచి 50 ఎంయూలు అధికంగా వినియోగమైనట్టు ట్రాన్స్‌కో లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
అంతరాయం లేకుండా సరఫరా కోసం మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కరెంట్ తో పాటు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు, ఎన్సీఈ నుంచి కరెంట్ సేకరిస్తూ, సప్లై చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్‌కో నుంచి హైడల్, థర్మల్ అన్నీ కలిపి 100 ఎంయూలలోపే కరెంటు ఉత్పత్తి ఉంటోందని తెలిపారు.