- సాగు జోరు..కరెంట్ డిమాండ్ పీక్స్!
- రాష్ట్రంలో 14,655 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
- గత పదేండ్లలో జనవరి నెలలో ఇదే ఎక్కువ
- ఈ ఏడాది యాసంగి సాగు కోటి ఎకరాలకు చేరుతుందని అంచనా
- దాదాపు 29 లక్షలకు పైగా పంపుసెట్లతో యాసంగి సాగు
- వారం రోజులుగా భారీగా పెరిగిన కరెంట్వాడకం
- మార్చి నాటికి డిమాండ్ మరింత పెరిగే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగు హైక్కావడంతో కరెంట్ వాడకం పీక్స్‌కు చేరుకుంటోంది. గత పది పదిహేను రోజులుగా కరెంటు వాడకం గణనీయంగా నమోదవుతోంది. ఈ నెలలో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ నమోదవడమే కాకుండా.. రోజు వారీగా భారీగా కరెంటు వినియోగం పెరిగిపోయింది.
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోవుతున్నప్పటికీ యాసంగిలో వరి సాగు పెరగడంతో కరెంట్ వాడకం పెరిగింది. ఈ నెలలో 3వ తేదీన రికార్డు స్థాయిలో 14,655 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది.
ఇప్పటి వరకు గత పదేండ్లలో జనవరి నెలలో ఇంత పెద్దఎత్తున విద్యుత్ డిమాండ్ నమోదవడం ఇదే మొదటి సారి. 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, ఈ జనవరి నెలలో అంతకు మించి డిమాండ్ నమోదైంది. యాసంగి సాగు పెరడంతో అగ్రికల్చర్ యూసేజ్ పెరిగి ఈ నెలలో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడుతోంది.
పెరిగిన అగ్రికల్చర్ వినియోగం..
రాష్ట్రంలో ఇప్పుడు 29 లక్షలకుపైగా వ్యవసాయ కరెంటు కనెక్షన్లుండగా.. ఈ యేడు వానాకాలంలో వర్షాలు పడి.. బావులు, బోర్లు, చెరువుల్లో నీళ్లు ఉండటంతో యాసంగి సాగు వేగం పుంజుకుంది. కరెంటు వినియోగం పెరుగుతూ వస్తున్నాయి.
ఈ యాసంగిలో ఇప్పటికే దాదాపు 15లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. నిరుడు కంటే ఇప్పటికే 5లక్షల ఎకరాలు ఎక్కువ సాగైంది. భూగర్భ జలాలు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29లక్షల బోర్లు నడుస్తున్నాయి. కాలువల ద్వారా వచ్చే నీటికంటే ఈ బోర్లు ఎక్కువగా నీటిని పంపింగ్ చేస్తుండడంతో కరెంటు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. -
మార్చిలో 15వేల మెగావాట్లు దాటనున్న డిమాండ్..
యాసంగి పంటల సాగు ప్రారంభంలోనే కరెంటు డిమాండ్ ఇంత అధికంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మార్చి నాటికి 17వేల మెగావాట్లు దాటే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నరు.
వరిపొలాలకు నీటిని అందించేందుకు రైతులు మోటార్లు వినియోగిస్తుండడంతో కరెంటు వాడకం భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు మార్చి నాటికి ఎండలు పెరిగి గృహ వినియోగం కూడా పెరగనుంది.
ఇవన్నీ కలిసి కరెంట్ వినియోగం పెరిగి డిమాండ్ సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గడిచిన వారం పది రోజులు కరెంటు డిమాండ్ రోజూ 14 వేల మెగావాట్లకు పైగానే ఉంటోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు ఉంటున్నారు. మార్చి నాటికి 17వేల మెగావాట్లు దాటిపోతుందని చెప్తున్నారు.
సరఫరా చేసేందుకు డిస్కంలకు సవాలే..
డిమాండ్‌కు తగ్గట్టు త్రీ ఫేజ్ కరెంటు సరఫరా చేయడానికి డిస్కంలకు సవాల్‌గా మారనుంది. యాసంగి సాగు పెరగడంతో బోర్లు నడుస్తుంటే కరెంటు సరఫరా 250 మిలియన్ యూనిట్ల నుంచి 263 ఎంయూలకు పైగానే కరెంటు వాడకం జరుగుతోంది. రోజువారీగా జెన్‌కో ఉత్పత్తి 75 మిలియన్ యూనిట్లలోపే ఉంటోంది.
మరో 165 మిలియన్ యూనిట్లు సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్‌ల నుంచి కొంటుండగా మరో 40 మిలియన్ యూనిట్ల వరకు నేషనల్ కరెంటు ఎక్సేంజీల నుంచి కొంటోంది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయడానికి డిస్కంలు త్రీఫేజ్ కరెంటు ఇవ్వడానికి సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ప్రధానంగా వ్యవసాయ పంపు సెట్లకు త్రీఫేజ్ కరెంటు ఇవ్వడానికి ఇప్పటి నుంచే కరెంటు సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి అత్యధికంగా కరెంట్ వినియోగంలో పాత రికార్డులన్నీ చెరిగిపోతూ, కొత్త రికార్డులు నమోదవుతాయని.. ఇది కొంత సవాల్‌గా మారే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.