వానాకాలంలోనూ కరెంట్​కు మస్త్ డిమాండ్

వానాకాలంలోనూ కరెంట్​కు మస్త్ డిమాండ్
  • గురువారం 15,573 మెగావాట్ల డిమాండ్ నమోదు
  • నిరుటి కంటే భారీగా పెరిగిన కరెంటు వాడకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలంలోనూ విద్యుత్​ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 7:30 గంటలకు రాష్ట్రంలో 15,573 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. నిరుడు ఇదే టైమ్​లో 14,816 మెగావాట్లు మాత్రమే నమోదు కాగా, ఈయేడు ఇదే టైమ్​కు కరెంట్ డిమాండ్ భారీగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గత మార్చి 8వ తేదీన ఎండాకాలం మొదట్లోనే ఏకంగా 15,623 మెగావాట్ల డిమాండ్ నమోదు అయింది. ఇదే ఇప్పటివరకు ఉన్న పీక్ డిమాండ్. 

Also Read:-4 రోజులు ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలు బంద్

అయితే ఈసారి వానాకాలంలో సైతం ఇంత అధికంగా కరెంటు డిమాండ్ పెరగడం గమనించదగ్గ విషయం. ఈ ఆగస్టు నెలలో ఇదే రోజున 266.14 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా కాగా, అదే గత 2023 ఆగస్టు నెలలో ఇదే రోజున 250.25 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా జరిగింది. అంటే గతంలో కంటే ఈయేడు దాదాపు 16 మిలియన్ యూనిట్లు అంటే కోటి 60 లక్షల యూనిట్లు అధికంగా వాడకం జరిగినట్లు ట్రాన్స్​కో తెలిపింది. అయితే, ఈ వానాకాలం పంట సీజన్​లో పీక్ డిమాండ్ 17,000 మెగావాట్ల వరకు వచ్చినా కరెంటు సరఫరాకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. కాగా, కరెంట్ డిమాండ్ పెరిగినా సమర్థంగా సరఫరా చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపినట్టు అధికారులు చెప్పారు.