
- హైదరాబాద్‌తో పాటు పలు టౌన్లలో భారీ డిమాండ్
- అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్డర్స్
హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్వినియోగం క్రమంగా తగ్గుతున్నా.. వేసవి తీవ్రతతో పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌డిమాండ్ పెరుగుతున్నదని ఎనర్జీ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. బుధవారం (April 2) జెన్కో ఆడిటోరియంలో విద్యుత్ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సిబ్బంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
అనంతరం సుల్తానియా మాట్లాడుతూ.. ఈ యాసంగి సీజన్ లో విద్యుత్ డిమాండ్ 17,162 మెగా వాట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం సీజన్ డిమాండ్ క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామీణ సర్కిళ్లలో విద్యుత్ డిమాండ్ తగ్గుతున్నదని, ఎండల ప్రభావంతో అర్బన్ సర్కిళ్లలో క్రమంగా పెరుగుతున్నదని చెప్పారు. గత వేసవితో పోల్చుకుంటే ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందని వాతారవరణ శాఖ అంచనాలు ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో విద్యుత్ డిమాండ్ భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. డిమాండ్ ఎంత పెరిగినా.. దానికి తగ్గట్టు సరఫరా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రతి వినియోగదారుడితో మంచి రిలేషన్ ను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, సదరన్ డిస్కం డైరెక్టర్లు నరసింహులు, సాయి బాబా, నంద కుమార్, సుధా మాధురి, చీఫ్ ఇంజినీర్ చక్రపాణి, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.