తెలంగాణలో విద్యుత్​ డిమాండ్​ తగ్గింది

  • చలి తీవ్రతతో తగ్గిన వినియోగం 
  • సెప్టెంబరులో 15,570 మెగావాట్ల పీక్​కు
  • నేడు 10 వేల మెగావాట్లకు పడిపోయిన డిమాండ్
  • రోజుకు వంద మిలియన్​ యూనిట్ల వరకు తగ్గిన వాడకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్​ డిమాండ్​ క్రమంగా తగ్గుతున్నది. వాతావరణంలో మార్పులతో పాటు వానాకాలం సాగు చివరి దశకు చేరడంతో  అగ్రికల్చర్  విద్యుత్  వినియోగం తగ్గడంతో విద్యుత్​ డిమాండ్​ కూడా తగ్గుతోంది. అక్టోబరులో వరికోతలు వేగం పుంజుకోవడంతో అప్పటి వరకు ఉన్న కరెంట్​ డిమాండ్​ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 

ఒకవైపు అగ్రికల్చర్​ డిమాండ్​ తగ్గిపోవడం, మరోవైపు చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గృహ విద్యుత్​ వినియోగం కూడా తగ్గుతున్నది. ఈనెలాఖరు వరకు మరింత తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో వానాకాలం వరిసాగు రికార్డు స్థాయిలో 66.77లక్షల ఎకరాల్లో సాగైన నేపథ్యంలో అగ్రికల్చర్​ కరెంటు వినియోగం ఎక్కువగా జరిగింది. 

లేట్​గా అయినా వర్షాలు భారీగా కురువడంతో నీటి సౌలభ్యం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు భూగర్భ జలాలు కూడా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల బోర్ల కింద సాగు జరిగింది. కాలువల ద్వారా వచ్చే నీటి కంటే ఈ బోర్లు ఎక్కువగా నీటిని పంపింగ్‌‌  చేయడంతో కరెంటు వాడకం పెరిగింది. గత ఆగస్టు నుంచే కరెంట్​ డిమాండ్​ గణనీయంగా పెరిగింది.

 సెప్టెంబరులో విద్యుత్​ డిమాండ్​ అత్యథికంగా నమోదైంది. ఫలితంగా విద్యుత్​ డిమాండ్‌‌  ఈ రెండు నెలల్లోనే 15 వేల మెగావాట్ల మైలు రాయిని దాటేసింది. గత సెప్టెంబరు 20న 15,570  మెగావాట్లకు చేరింది. వానాకాలం సీజన్‌‌లో ఇంత పెద్ద ఎత్తున విద్యుత్​ డిమాండ్‌‌ నమోదవడం గమనార్హం. అక్టోబరు​ ప్రారంభం వరకు అంతే స్థాయిలో కరెంట్​ వాడకం జరిగింది. 

అక్టోబరు​ ప్రారంభం నుంచి వరికోతలు జోరందుకోవడంతో అప్పటి వరకు భారీగా ఉన్న కరెంట్​ డిమాండ్​ క్రమంగా తగ్గుతూ వచ్చింది. తాజాగా అది 10 వేల మెగావాట్ల కన్నా పడిపోయింది.

రోజుకు వంద మిలియన్​ యూనిట్ల వరకు తగ్గిన వాడకం

గత సెప్టెంబరులో రాష్ట్రంలో కరెంట్​ వినియోగంలోనూ 304 మిలియన్​ యూనిట్లు ఉండగా.. నేడు అది రాష్ట్రవ్యాప్తంగా 208.32 మిలియన్​  యూనిట్లకు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్‌‌  ఉత్పత్తి సంస్థ జెన్‌‌కో నుంచి హైడల్‌‌, థర్మల్‌‌  వరకు అన్నీ కలిపి  100 మిలియన్‌‌  యూనిట్ల లోపే కరెంటు ఉత్పత్తి ఉంటోంది. వరికోతలు చివరి దశకు చేరడం, మరోవైపు వానాకాలం ఇతర పంటలన్నీ చివరి దశలో ఉండడంతో  ఈనెలాఖరు వరకు మరింత తగ్గే అవకాశం ఉందని విద్యుత్​  అధికారులు అంటున్నారు. 

దీంతో ప్రభుత్వంపై విద్యుత్  కొనుగోళ్ల భారం తగ్గింది. ఈ యాసంగిలో సాగు వేగం పుంజుకుంటే వచ్చే మార్చినాటికి కరెంట్​ వాడకం మళ్లీ పెరిగే అవకాశం విద్యుత్​ వర్గాలు చెప్తున్నాయి.