పాలమూరు పంపులకు పవర్​ కట్.​!కరెంట్ సరఫరా నిలిపేసిన ట్రాన్స్​కో

పాలమూరు పంపులకు పవర్​ కట్.​!కరెంట్ సరఫరా నిలిపేసిన ట్రాన్స్​కో
  • నార్లాపూర్​ పంప్​హౌస్​కు కరెంట్ సరఫరా నిలిపేసిన ట్రాన్స్​కో
  • రూ.700 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్​
  • 2022లో రూ.500 కోట్లకు బిల్లులు రైజ్​ చేసిన ట్రాన్స్​కో
  • నాడు బీఆర్ఎస్​ హయాంలో ఆర్థిక శాఖ వద్ద పెండింగ్​
  • కేసీఆర్ ​ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందే కరెంట్​ కట్​ చేసిన ట్రాన్స్​కో

హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్​ పంప్​హౌస్​కు విద్యుత్​ శాఖ కరెంట్​ కట్​ చేసింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఏడాదిన్నరపాటు బిల్లులు పెండింగ్​లో పెట్టడం.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి నాటి బీఆర్ఎస్​ హయాంలోనే బిల్లులు పెండింగ్​ పెట్టగా.. అప్పటి సీఎం కేసీఆర్​ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందే విద్యుత్​శాఖ కరెంట్​సరఫరాను నిలిపేసింది. పాలమూరు ప్రాజెక్టు కోసం ట్రాన్స్​కో ఓ సబ్​స్టేషన్​తో పాటు భారీ లైన్లను నిర్మించింది. దానికి రూ.500 కోట్లు ఖర్చు చేసింది. దానికి సంబంధించి 2022 జూన్​ 6నే బిల్లులకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖకు చేరినా.. డబ్బులు మాత్రం రిలీజ్​ చేయలేదు. 

దీంతో 2023 సెప్టెంబర్​ 16న కేసీఆర్​ ప్రారంభించాలనుకున్న ప్రాజెక్టుకు ట్రాన్స్​కో అధికారులు కరెంట్​ కట్​ చేశారు.  అయితే, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, తాత్కాలికంగా కరెంట్​ సరఫరాను పునరుద్ధరించేలా చేశారు. అది కూడా ఒక్క మోటార్​ నడవడానికే కరెంట్​ఇచ్చారు. కేసీఆర్​ ఆ పథకాన్ని ప్రారంభించిన రెండు రోజులకే మళ్లీ కరెంట్​ను కట్​ చేశారు. అయినా కూడా బిల్లులు చెల్లించలేదు. మరోవైపు కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో రూ.200 కోట్ల బిల్లులు కాగా.. దానికి కూడా ట్రాన్స్​కో అధికారులు ఆర్థిక శాఖ వద్ద బిల్లుల క్లియరెన్స్​కు అప్లికేషన్​ పెట్టుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు రూ.700 కోట్ల వరకు బకాయిలు పడడంతో ఆ ప్రాజెక్టుకు కరెంట్​ను నిలుపుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, నార్లాపూర్​ పంప్​హౌస్​లో 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 మోటార్లను పెట్టాలని నిర్ణయించినా.. 4 మోటార్లనే ఏర్పాటు చేశారు. ట్రాన్స్​కో లైన్​ ఇచ్చి డిస్కంలు విద్యుత్​ సరఫరాను పునరుద్ధరిస్తేనే నార్లాపూర్​ రిజర్వాయర్​ను నింపుకొనే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు.

కల్వకుర్తిలో 2 మోటార్లు పనిచేయట్లే..

పాలమూరు ప్రాజెక్టుకు కరెంట్​ నిలిపివేత ఎఫెక్ట్​ ఇప్పుడు పరోక్షంగా కల్వకుర్తి లిఫ్ట్​పై పడినట్టయింది. కల్వకుర్తి లిఫ్ట్​ స్కీమ్​లో 30 మెగావాట్ల కెపాసిటీ ఉన్న 5 మోటార్లుండగా.. అందులో 2 మోటార్లు నాలుగేండ్లుగా పనిచేయడం లేదు. బ్రెస్ట్​ వాల్​ కూలిపోవడంతో మోటార్లకు నీటిని తీసుకెళ్లే ట్యూబ్​లు దెబ్బతిన్నాయి. వాటికి రిపేర్లు చేయాలంటే శ్రీశైలంలో నీటి నిల్వలు తగ్గడంపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గితే.. హెడ్​ రెగ్యులేటర్​ను కట్టి.. డ్రాఫ్ట్​ ట్యూబ్​లను సరిచేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతుండడంతో రిపేర్లకు ఇదే కరెక్ట్​ టైం అని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు నుంచే ఏడు జిల్లాలకు తాగునీటిని అందిస్తున్నారు.

 ఈ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తే.. నార్లాపూర్​ రిజర్వాయర్​ నుంచి కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎల్లూరుకు తరలించి.. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడొచ్చని అధికారులు అనుకుంటున్నారు. పాలమూరులోని నార్లాపూర్​, కల్వకుర్తి లిఫ్ట్​లోని ఎల్లూరు రిజర్వాయర్​లు పక్కపక్కనే ఉండడంతో ఏ ఇబ్బంది లేకుండా నీటిని తరలించొచ్చన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ, ప్రస్తుతం నార్లాపూర్​ పంప్​హౌస్​కు కరెంట్​ కట్​ చేయడంతో ఇది కూడా సందిగ్ధంలో పడినట్టయింది. కాగా, నార్లాపూర్ రిజర్వాయర్​ పనులు దాదాపుగా పూర్తయినా.. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్​కు నీటిని తరలించే కాలువ పనులు మాత్రం చాలా కాలంగా పెండింగ్​లో పడిపోయాయి. 8 కిలోమీటర్ల మేర పనులు ఏడాదిన్నరగా పెండింగ్​ ఉన్నాయి. అయితే, అంచనాలను సవరిస్తే తప్ప పనులు చేసేది లేదని కాంట్రాక్టర్​ ఆ పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఈ రెండు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు.