రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి  చిక్కాడు ఓ విద్యుత్‌ ఉద్యోగి.  నల్గొండ జిల్లా చింతపల్లిలో విద్యుత్‌శాఖ ఆర్టిజన్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు వేణు.  బోరుకు విద్యుత్ కనెక్షన్‌ ఇచ్చేందుకు సూర్యనారాయణ అనే రైతును రూ.50 వేల లంచం అడిగాడు వేణు . అయితే బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో  పక్కా ప్లాన్ ప్రకారం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వేణును  పట్టుకున్నారు.  

మరోవైపు భద్రాద్రిలో రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ  ఏసీబీకి చిక్కాడు అశ్వారావుపేట ట్రాన్స్‌కో ఏఈ శరత్‌ కుమార్‌.  వ్యవసాయ క్షేత్రానికి ట్రాన్స్‌ఫార్మర్‌ ఇచ్చేందుకు  కొనకళ్ల ఆదిత్య అనే  రైతును లంచం అడిగాడు శరత్‌కుమార్‌. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులకు శరత్‌కుమార్‌ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.  అనంతరం అశ్వారావుపేట సబ్ స్టేషన్ లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.

అటు మెదక్ జిల్లా  నర్సాపూర్  లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.  మండల వ్యవసాయ అధికారి అనిల్ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.  ట్రేడ్ లైసెన్స్  ఇవ్వడానికి గాను అనిల్ రూ. 30 వేలు డిమాండ్ చేశాడు.  దీంతో బాధితుడు  ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు  అనిల్ కుమార్ ను  ట్రాప్  చేసి అదుపులోకి తీసుకున్నారు.