
ఇక సమావేశాలు ఉండవు
తేల్చిచెప్పిన జస్టిస్ ధర్మాధికారి
తెలంగాణ ఆఫర్‌ను తిరస్కరించిన ఏపీ
హైదరాబాద్, వెలుగు: కరెంట్ ఉద్యోగుల విభజన అంశంపై ఏక సభ్య కమిషన్ జస్టిస్ ధర్మాధికారి త్వరలో తుది ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆదివారం కమిషన్ ముందు తెలంగాణ, ఏపీ వాదనలు వినిపించాయి. చివరగా జస్టిస్ ధర్మాధికారి మాట్లాడుతూ.. ఇదే చివరి సమావేశమని, ఇక సమావేశాలు ఉండవని తేల్చిచెప్పారు. ఇవే ఫైనల్ ప్రొసీడింగ్స్ అని, ఫైనల్ ఆర్డర్ ఇచ్చేస్తానని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా తెలంగాణ విద్యుత్ సంస్థల హెచ్‌ఆర్ డైరెక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఏపీ 613 మందిని తీసుకున్నట్లయితే, తెలంగాణకు వస్తామన్న 256 మందిలో 50 శాతం మందిని తీసుకోవడానికి సుముఖంగా ఉన్నామని చెప్పారు.
ఆంధ్రలో పని చేసిన తెలంగాణ స్థానికత కలిగిన 242 మందిని షరతులు లేకుండా తీసుకోవడానికి అంగీకరించారు. ఈ ప్రపోజల్‌కు ఏపీ విద్యుత్ యాజమాన్యాలు అంగీకరించలేదు. తెలంగాణ నుంచి వచ్చే వారిని ఒక్కరిని కూడా తీసుకోబోమని, తమ వద్ద పోస్టులు ఖాళీగా లేవని, అంగీకరించే ప్రసక్తే లేదని ఏపీ తేల్చిచెప్పింది. ఈ సమావేశంలో తెలంగాణ యాజమాన్యం నుంచి ట్రాన్స్ కో హెచ్‌ఆర్ డైరెక్టర్ అశోక్ కుమార్, సీజీఎం నర్సింహా, ఆంధ్రా యాజమాన్యం నుంచి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథ్ , జేఎండీ చక్రధర్ బాబు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ విద్యుత్ సంఘం నాయకులు శివాజీ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్థలు పరిష్కార దిశగా ప్రయత్నం చేసినా ఆంధ్రా యాజామన్యాలు సమస్యను జఠిలం చేస్తున్నాయన్నారు. ‘మీరు కాదంటే ఏపీకి చెందిన వారిని మేమేలా తీసుకుంటాం’ అని ప్రశ్నించారు.