
- ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇచ్చే అవకాశం
- మార్గదర్శకాలు రూపొందించాలన్నధర్మాధికారి కమిటీ
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం మళ్లీ మొదటికి వస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ ఆప్షన్లు కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల డైరెక్టర్లతో ఏర్పాటు చేసిన కమిటీకి మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతలను అప్పగించి నట్లు సమాచారం. 5 గంటలపాటు సాగిన జస్టిస్ ధర్మాధికారి సమావేశానికి ఇరు రాష్ట్రాల ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, లీగల్ అడ్వయిజర్లు, ప్రభుత్వ ప్లీడర్లు హాజరు కాగా, తెలంగాణ ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రా వు హాజరు కాలేదు. తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస రావు, డైరెక్టర్లు , ఎస్పీడీసీఎల్(హైదరాబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) సీఎండీలు హాజరయ్యారు. కాగా, మార్గదర్శకాలు రూపొందించడం తమ ప్రయోజనాలకు విఘాతమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివాజీ, మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలోని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో తమ అభ్యంతరాలను కమిటీకి వివరించారు.