కాళేశ్వరం బ్యారేజీల స్థలాలు కరెక్టు కాదు..సీడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది

కాళేశ్వరం బ్యారేజీల  స్థలాలు కరెక్టు కాదు..సీడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది
  • సీడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది.. ముంపు తప్పదని కూడా హెచ్చరించింది
  • కాళేశ్వరం కమిషన్​ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్​ జేఏసీ నేత రఘు 
  • రెండో టీఎంసీనే సరిగ్గా వాడుకుంటలేం.. మూడో టీఎంసీ ఎందుకు?
  • తుమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద ఆరు రెట్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి
  • అనవసరంగా కరెంటు ఖర్చు, వేలాది ఎకరాల ముంపు తప్ప మేడిగడ్డతో ఉపయోగం లేదు
  • టెండర్లు లేకుండా నామినేషన్​ పద్ధతిలో కాంట్రాక్ట్​లు ఇచ్చేశారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించిన ప్రాంతాలు సరైనవి కావంటూ సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) అప్పట్లోనే తన రిపోర్టులో చెప్పిందని.. ఆధారాలతో వివరించిందని విద్యుత్​ జేఏసీ నేత రఘు అన్నారు. పంప్​హౌస్​లు నిర్మించిన ఎత్తు కూడా తక్కువగా ఉందని, ఎప్పటికైనా ముంపు ప్రమాదం ఉంటుందని స్పష్టంగా ఆ రిపోర్టులో పేర్కొందని తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని 19 మీటర్లకు ఎత్తిపోస్తే సరిపోతుందని ఆయన అన్నారు. అదే మేడిగడ్డ సిస్టమ్​లో 123 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాల్సి వస్తుందని తెలిపారు. అది ఆరు రెట్లు ఎక్కువని, తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుతో కరెంట్​ ఖర్చులు కూడా ఆరు రెట్లు ఎక్కువ అవుతాయని పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఆయకట్టు అనేదే లేదని రఘు వివరించారు. అనవసరంగా కరెంటు ఖర్చు.. వేలాది ఎకరాలు ముంపు తప్ప మేడిగడ్డతో ఉపయోగం లేదన్నారు. తుమ్మిడిహెట్టిని నిర్మిస్తే తక్కువ ఖర్చుతో ఆదిలాబాద్​లో 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ఆస్కారం ఉండేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ఓపెన్​ కోర్టుకు రఘు హాజరయ్యారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. 

మేడిగడ్డ వద్ద అదనపు స్టోరేజీ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. బ్యారేజీలను డ్యాములుగా స్టోరేజీ పర్పస్​కు వాడుకోవడం వల్లే అసలు సమస్యంతా వచ్చిందన్నారు. మూడో టీఎంసీ కూడా దండుగేనని పేర్కొన్నారు. దాని వల్ల అదనంగా ఒక్క ఎకరాకూ నీళ్లు రావన్నారు. కేవలం 15 టీఎంసీల అదనపు జలాల కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. దానికీ టెండర్లు లేకుండా నామినేషన్​ పద్ధతిలోనే కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు. ‘‘అసలు ఉన్న కాళేశ్వరంలోనే రెండో టీఎంసీనే సక్కగా ఏనాడూ వాడుకోలేదు. మూడో టీఎంసీలో నీటిని కాల్వల నుంచి కాకుండా ప్రెషర్​ మెయిన్స్​తో తరలిస్తారు. ఫలితంగా మొదటి దశ కాళేశ్వరం కరెంట్​ ఖర్చులతో పోలిస్తే మూడో టీఎంసీ తరలింపులోనే కరెంట్​ ఎక్కువగా ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో తుమ్మిడిహెట్టి లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించాల్సిన​అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి కూడా ఎల్లంపల్లికి నీళ్లు గ్రావిటీలో రావన్నారు. గ్రావిటీతో వస్తాయని ఎవరూ చెప్పలేదని ఆయన తెలిపారు. ప్రాణహిత –చేవెళ్ల, కాళేశ్వరం డీపీఆర్​లను చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని 19 మీటర్లకు ఎత్తిపోస్తే సరిపోతుందని ఆయన చెప్పారు.  

తుమ్మిడిహెట్టి వద్ద  నీళ్లు లేవనడం అబద్ధం

తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని గత పాలకులు చెప్పడం శుద్ధ అబద్ధమని రఘు అన్నారు. ‘‘వాస్తవానికి మనకు అక్కడ కావాల్సింది కేవలం 160 టీఎంసీలే.  గోదావరి వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ తీర్పు ప్రకారం ఎగువ రాష్ట్రాలు నీటిని వాడుకున్నాకే తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని  సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పింది. అయితే, ఎగువ రాష్ట్రాలు తమ వాటా కోటాను వాడుకున్న తర్వాత మిగులు జలాల్లోనూ 63 టీఎంసీలు వాడుకుంటేనే 102 టీఎంసీలుంటాయని తప్పుడు లెక్కలు చెప్తున్నారు. మరి, 60 టీఎంసీలు కాకుంటే 600 టీఎంసీలూ వాడుకుంటారని అంటే.. అది అసంబద్ధమైన వాదన అవుతుంది.  75 శాతం డిపెండబిలిటీ ప్రకారం అక్కడ 102 టీఎంసీల నీళ్లే ఉంటాయంటున్నారు. 

కానీ, సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం 75 ఏండ్లలో 65 ఏండ్ల పాటు అక్కడ 255 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మిగతా పదేండ్లలో 102 టీఎంసీలున్నాయి. అది కూడా ఎగువ రాష్ట్రాలు మిగులు జలాలనూ వాడుకుంటేనే! ఈ లెక్కల ప్రకారం వందేండ్లలో పది సంవత్సరాలు నీళ్లు కొంచెం తగ్గితే కొంపలేం మునగవు. కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సంవత్సరం కూడా 50 టీఎంసీలకు మించి ఎత్తిపోయలేదు” అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించుకునేందుకు ఒప్పుకున్నదని తెలిపారు. ఆ ఎత్తులోనూ నీటిని తరలించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాలువ లోతు లేదా వెడల్పును కొంచెం పెంచడం ద్వారా.. 152 మీటర్ల ఎత్తుతో ఎంతైతే నీటిని తరలించాలనుకున్నారో 148 మీటర్ల ఎత్తులోనూ అంతే మొత్తంలో నీటిని తరలించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా మరే ఇతర స్థలాలను పరిశీలించలేదని, కేవలం మేడిగడ్డనే ఎంచుకున్నారని.. కాగ్​ దీనిపై ప్రశ్నిస్తే గత ప్రభుత్వం వద్ద సమాధానం లేదని ఆయన అన్నారు. మేడిగడ్డను ఎంచుకోవడం ఎలాంటి ఇంజనీరింగ్​ అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయమని విమర్శించారు. మేడిగడ్డపై ఎన్​డీఎస్​ఏ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. రిపేర్లకు ఎంత ఖర్చవుతుందో వేచి చూడాలని తెలిపారు.  

రిపోర్టులు ఎక్కడి నుంచి తీసుకున్నారు
- రఘును ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్

అఫిడవిట్​ను ఎందుకు వేశారని విద్యుత్​ జేఏసీ నేత రఘును కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ప్రశ్నించగా.. పర్సనల్​ కెపాసిటీలోనే వేశానని ఆయన చెప్పారు. అయితే, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా కోర్టులో పిల్​ వేశారా? అని ప్రశ్నించగా.. ఇతర అంశాలకు సంబంధించి వేశానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇచ్చిన అఫిడవిట్​లో పేర్కొన్న రిపోర్టులను తీసుకొచ్చారా? అని ప్రశ్నించగా.. అఫిడవిట్​తో పాటే సమర్పించానని రఘు అన్నారు. ఆ రిపోర్టులను ఎక్కడి నుంచి తీసుకున్నారని ప్రశ్నించగా.. పబ్లిక్​ డొమైన్​లో ఉన్నాయని, సీడబ్ల్యూసీ రిపోర్ట్​ మినహా మిగతా వాటిని వెబ్​సైట్స్​ నుంచి తీసుకున్నానని ఆయన వివరించారు. అయితే, అవి జెన్యూన్​ రిపోర్ట్స్​ అని ఎలా అనుకోవాలని రఘును కమిషన్​ ప్రశ్నించింది. ఆర్టీఐ ద్వారానో లేదంటే నేరుగా డిపార్ట్​మెంట్​ నుంచో తీసుకుంటే వాటికి విలువ ఉండేదని పేర్కొంది. లేదంటే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని కమిషన్​ సూచించింది.