
- నిర్మల్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో కనిపించని విద్యుత్ వెలుగులు
- 13 గ్రామాలకు సింగిల్ ఫేజే దిక్కు
- చిమ్మచీకట్లోనే మూడు గ్రామాలు
- తమకు 46 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తేనే పర్మిషన్ ఇస్తామంటున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలోని అనేక మారుమూల గిరిజన పల్లెలు విద్యుత్ వెలుగు కోసం యాభై ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా తమ గ్రామాలకు కరెంట్ వస్తుందని ఆశపడిన గిరిజనులకు నిరాశే మిగిలింది. దీంతో నిర్మల్ జిల్లాలోని పెంబి, కడెం మండలాల్లోని 16 గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో పెంబి మండలంలోని పోచంపల్లి, పెదరాగి దుబ్బ, గోధుమల గ్రామాలకు కనీసం సింగిల్ ఫేజ్ కరెంట్ రాకపోవడంతో ఆ గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. తమ గ్రామాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నికల టైంలో ఆయా గ్రామాల్లో పర్యటించే ప్రతీ నాయకుడు కరెంట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి, తర్వాత అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
ఆటంకంగా అటవీశాఖ అనుమతులు
పెంబి, కడెం మండలాల్లోని 16 గిరిజన గ్రామాలు కవ్వాల్ అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తమకు 23 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే తాము పర్మిషన్ ఇస్తామంటూ గతంలో అటవీ శాఖ షరతులు విధించింది.
స్పందించిన విద్యుత్ శాఖ ఆఫీసర్లు విషయాన్ని అప్పటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో భైంసా ప్రాంతంలో అటవీ శాఖకు 23 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కానీ తర్వాత రూల్స్ మారాయంటూ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మరో మెలిక పెట్టింది. కొత్త చట్టం ప్రకారం ఇప్పటికే 23 ఎకరాలకు తోడు మరో 23 ఎకరాలు కేటాయిస్తేనే అనుమతులు ఇస్తామంటూ స్పష్టం చేసింది. అటవీ, విద్యుత్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఆయా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే విషయం మరుగున పడిపోయింది.
కాంగ్రెస్ సర్కారైనా కరుణించాలని వేడుకోలు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అయినా తమ గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పించాలని కడెం, పెంబి మండలంలోని 16 గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కోరుతున్న విధంగా భూమిని అప్పగించి పర్మిషన్ వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
మా గోడు పట్టించుకోండి
కరెంట్ సౌకర్యం కోసం ఆఫీసర్లు, లీడర్ల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటివరకు ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ గోడును పట్టించుకోవాలి. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్పందించి కరెంట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేయాలి.
జైతు, కోసగుట్ట,పెంబి మండలం