- బీఆర్ఎస్ లీడర్‌పై కరెంటోళ్ల ప్రేమ.. రైతు భూమి నుంచి విద్యుత్ లైన్
- నాయకుడి పొలంలో నుంచి తీసి రైతు భూమి నుంచి వేసిన్రు
- ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న అన్నదాత
- అయినా పట్టించుకుంటలేరుతాజాగా ఆరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు
తిమ్మాపూర్, వెలుగు: అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ భూమి నుంచి వేయాల్సిన 33 కేవీ విద్యుత్ లైన్ ను దళిత రైతు భూమిలోకి జరిపి వేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ 8వ డివిజన్ గ్రామానికి చెందిన సిరిసిల్ల అంజయ్య అనే రైతుకు 82/ఎఫ్ సర్వే నెంబర్లో 18 గుంటల భూమి ఉంది. ఇందులో కొన్నేండ్లుగా అంజయ్యే సాగు చేసుకుంటున్నాడు. ఇతని భూమి పక్కనే ఓ బీఆర్ఎస్ లీడర్‌కు వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఇదివరకే 33 కేవీ కరెంట్ లైన్ ఉంది. ఇటీవల భూముల ధరలకు రెక్కలు రావడంతో భవిష్యత్‌లో అమ్ముకుందామంటే బీఆర్ఎస్ లీడర్‌కు ఇబ్బంది రాకూడదని ఆ లైన్‌ను తీసేసి అంజయ్య పొలం నుంచి వేశారు.
అయితే...పక్కన ఉన్న లైన్తొలగించి తన భూమిలో నుంచి వేయడం ఏమిటని విద్యుత్ ఖాశాధికారులను అంజయ్య ప్రశ్నించాడు. దీంతో బీఆర్ఎస్లీడర్కు భూమి అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పాలని డీఈ బేరసారాలకు దిగాడని, తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పడంతో ఇబ్బందులు పెడుతున్నాడని అంజయ్య ఆరోపించాడు. ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని వాపోయాడు. తన పొలంలో వేసిన విద్యుత్ లైన్‌ను మార్చి విద్యుత్ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ప్రజావాణికి తిరుగుతనే ఉన్నడు
విద్యుత్ లైన్ ను తొలగించాలని ఆరు నెలలుగా ప్రజావాణిలో మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని అంజయ్య చెప్పాడు. తాజాగా మరోసారి సోమవారం కరెంట్ లైన్ తొలగించాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాడు.