- కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేల డిమాండ్
- పట్టుకున్నఏసీబీ ఆఫీసర్లు
- ఆపరేషన్స్ ఇన్‌చార్జి డీఈఈ కూడా అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు : ఓ కాంట్రాక్టర్‌కు పనుల అగ్రిమెంట్ చేసేందుకు రూ. 10 వేలు లంచం తీసుకున్న విద్యుత్‌శాఖ ఏడీఈ (ఇన్‌చార్జి డీఈఈ), సబ్ ఇంజనీర్‌ను గురువారం నల్లగొండలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మునుగోడు సబ్ డివిజన్ ఏడీఈ (ఆపరేషన్స్ ఇన్‌చార్జి డీఈఈ) సీహెచ్ శంకరయ్య, సబ్ ఇంజినీర్ పబ్బతిరెడ్డి వెంకట్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.
నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మలగూడానికి చెందిన పడమటి నర్సిరెడ్డి అనే కాంట్రాక్టర్ రెండు నెలల కింద మండలంలో 20 పనులను పొందారు. వాటి ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది. విద్యుత్‌శాఖ అధికారులైన ఇన్‌చార్జి డీఈఈ శంకరయ్య, సబ్ ఇంజినీర్ పబ్బతిరెడ్డి అగ్రిమెంట్స్‌పై సంతకం చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ఒక్కో అగ్రిమెంట్‌కు రూ.500 చొప్పున 20 అగ్రిమెంట్లకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. దీంతో బాధితుడు నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
గురువారం హైదరాబాద్ రోడ్‌లో ఉన్న విద్యుత్ శాఖ డీఈఈ ఆఫీసుకు నర్సిరెడ్డితో పాటు ఏసీబీ అధికారులు వచ్చారు. రూ.10 వేల క్యాష్‌ను సబ్ ఇంజినీర్ వెంకట్ రెడ్డి తీసుకోగా పట్టుకున్నారు. తర్వాత ఇన్‌చార్జి డీఈఈ శంకరయ్య ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లతో చర్చిస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న వారందరి ఫోన్లు తీసుకొని, ఉద్యోగ సంఘం నాయకులను బయటికి పంపించారు. శంకరయ్యను విచారించారు. ఆయన ప్రోద్బలం తోనే సబ్ ఇంజినీర్ లంచం తీసుకున్నట్లు గుర్తించారు. ఇన్‌చార్జి డీఈఈ, సబ్ ఇంజినీర్‌ను అరెస్టు చేశారు.