- వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలి
- అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- ఈ నెలలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ను సందర్శిస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ ప్లాంట్లో అక్టోబర్ నుంచి కరెంట్ ఉత్పత్తి ప్రారంభించాలని, వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి స్థాయిలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను ఆయన ఆదేశించారు. యాదాద్రి ప్లాంట్ పనుల పురోగతిపై ఆదివారం సెక్రటేరియెట్లో జెన్కో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి యూనిట్ అక్టోబర్ 30 కల్లా, రెండో యూనిట్ అక్టోబర్ 15 కల్లా, మూడో యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా, నాలుగో యూనిట్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి, 5వ యూనిట్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతుండడంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నదని జెన్కో అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.
సిబ్బంది కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, దోమల బారిన పడకుండా క్యాంపుల్లో దోమతెరలు సరఫరా చేయాలని, ఆయా ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ చేయాలని భట్టి ఆదేశించారు. స్టానికంగా క్వార్టర్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలన్నారు. క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాలగూడ, దామరచర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపు కోసం తాళ్ల వీరప్పగూడెం, దామరచర్లకు ఫోర్ లైన్ బైపాస్ రోడ్డు నిర్మాణం పురోగతిపై వారంలోగా నివేదిక ఇవ్వాలన్నారు. ఈ నెలలో ప్లాంట్ను సందర్శించి అధికారులతో భేటీ అవుతానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రివ్యూలో ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, జెన్కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.