ఈ మధ్య కాలంలో ఈ– సిగరెట్ గురించి వినే ఉంటారు. ఈ– సిగరెట్లు అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ ఇది మామూలు సిగరెట్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి ధూమపాన ప్రియులకు కోసం సృష్టించబడింది. ఈ– సిగరెట్లు అనేవి ఎలక్ట్రానిక్ సహాయంగా తయారు చేయబడ్డాయి. అవి ఖచ్చితంగా సిగరెట్లానే ఉంటాయి. కానీ, వాటిలో పొగాకు బదులుగా ఒక హీటర్, నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది.
నికోటిన్‌తో కూడిన నీటి ఆవిరిని పీలుస్తూ సిగరెట్ వ్యసనపరులు ఎలక్ట్రానిక్ సిగరెట్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. సిగరెట్లను వదిలిపెట్టే పేరుతో వీటిని అదేపనిగా వాడడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని వార్తలు వస్తుండడంతో వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇరవై లక్షల మంది ఎలక్ట్రానిక్ సిగరెట్లను వినియోగిస్తున్నట్లు అంచనా. దీంతో ఇకపై వైద్యులు సూచిస్తే తప్ప వీటిని విక్రయించరాదని అక్కడి అధికారులు ఆంక్షలు విధించారు.
ఇందులోనూ నికొటిన్
ఈ– సిగరెట్లు పరికరంతో పొగ తాగడం వలన ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని సైంటిస్టులు తేల్చేశారు. ఈ– సిగరెట్లు పరికరాలు పొగ కాకుండా.. ఆవిరి రూపంలో నికోటిన్ ను విడుదల చేస్తాయి. ఈ–సిగరెట్లో వాడే పొగాకులో కాల్చని నికొటిన్ ఉండటం వలన ఆరోగ్యానికి హానికరమని సాక్ష్యాలను సేకరించారు. దేశంలో తొలుత పంజాబ్, ఇటీవల మహారాష్ట్ర వీటిపై నిషేధం విధించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ–సిగరెట్లపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల సంగతులు ఇలా ఉన్నాయి.
వీటిలోనూ నికోటిన్ ఉంటుంది. దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి. ఈ–సిగరెట్‌లోని నికోటిన్ లిక్విడ్‌ను వేగంగా ఖాళీ చేస్తే.. శరీరంలో వణుకు పుడుతుంది. కండరాలు పట్టు తప్పుతాయి. కోమాలోకి వెళ్లి, మరణించే ప్రమాదమూ ఉంటుంది. యువతను బాగా ఆకర్షిస్తున్న ఎండ్స్‌కు వివిధ ఫ్లేవర్లను జోడించడాన్ని నిషేధించాలి. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట ఎండ్స్ వాడకాన్ని నిషేధించాలి. పొగ తాగనివారు, టీనేజ్ పిల్లలు వీటి బారిన పడకుండా ఉండేందుకు గాను వీటి ప్రకటనలకు పరిమితులు విధించాలి.
ఇదేమీ సురక్షితం కాదు
అమెరికా అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం..ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్‌తో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గితే తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్ఫరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే ఒక్కసారిగా వదిలేయడం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ.
తాజాగా గ్రీక్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ సిగరెట్ల మరో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లను అధికంగా వినియోగించటం కారణంగా పలువురిని శ్వాస సంబంధిత వ్యాధులు బాధిస్తున్నట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది. పలు ఆన్‌లైన్ సైట్‌లు వీటిని విక్రయించటం విశేషం. ఎలక్ట్రానిక్ సిగరెట్లను చిన్నారులకు మరింత చేరువ చేసే క్రమంలో పలు కంపెనీలు ఎలక్ట్రానిక్ సిగరెట్లను చెర్రీ, స్ట్రాబెర్రీ, వెనీలా, కుకీస్ ఇంకా మిల్క్ షేక్ ఫ్లేవర్లలో అందిస్తున్నాయి.
ALSO READ: విపత్తు ప్రమాదాలు తగ్గేదెలా? : డా. శ్రీధరాల రాము
ఎలక్ట్రానిక్ సిగరెట్లకు సంబంధించిన టీవీ ప్రకటనలు మీతిమీరుతున్నప్పటికీ ప్రభుత్వం పరంగా చర్యలు శూన్యం. వ్యాపార విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ కంపెనీలు ఏటా అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తున్నాయి. అమెరికాలో 53శాతం మంది యువత ఈ– సిగరెట్లు సాధారణ సిగరెట్లతో పోలిస్తే ఆరోగ్యకరమని భావిస్తున్నారట. ఈ–సిగరెట్లును అధికంగా ఉపయోగించటం కారణంగా ఆనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, కామారెడ్డి