తెలంగాణలో ఎలక్ట్రానికా ఫైనాన్స్​.. ప్రతి జిల్లాలోనూ బ్రాంచ్​లు

తెలంగాణలో ఎలక్ట్రానికా ఫైనాన్స్​.. ప్రతి జిల్లాలోనూ బ్రాంచ్​లు

హైదరాబాద్, వెలుగు:  ఎంఎస్​ఎంఈలకు ఫైనాన్సింగ్ చేసే పూణేకు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్​బీఎఫ్​సీ) ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్ (ఈఈఎల్​) తెలంగాణలో అడుగుపెట్టింది.    వరంగల్,  సూర్యాపేటలో ఏడు శాఖలను ప్రారంభించింది. ప్రతి జిల్లాలోనూ బ్రాంచ్​లను ఏర్పాటు చేస్తామని, మరికొన్ని నెలల్లో వీటి సంఖ్యను 50కి చేరుస్తామని తెలిపింది.  ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్  మధ్యప్రదేశ్ మార్కెట్‌‌‌‌లలో తమ లోన్​ప్రొడక్టులను అందిస్తోంది. తెలంగాణలో తనఖా అప్పులు (లోన్  ఎగైనెస్ట్ ప్రాపర్టీ) ఇస్తామని తెలిపింది.  ఇక్కడ మార్కెట్లో అవకాశాలను గురించి ఎలక్ట్రానికా  ఫైనాన్స్ సీఈఓ శిల్పా పోఫాలే మాట్లాడుతూ “తెలంగాణలో దాదాపు 2.6 మిలియన్ల ఎంఎస్​ఎంఈలు ఉన్నాయి. 

వీటిలో 56 శాతం  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.   మొదటిసారి  అప్పు తీసుకునే వాళ్లకు మేం ప్రాధాన్యం ఇస్తాం. మా సగటు లోన్​ సైజు రూ.ఐదు లక్షల వరకు ఉంటుంది. కస్టమర్​ ప్రొఫైల్​ ఆధారంగా వడ్డీరేటును నిర్ణయిస్తాం. ఉదాహరణకు, నల్గొండ చేనేత కార్మికులు, సూర్యాపేట (ప్రధాన పత్తి ఉత్పత్తి జిల్లా), ఎర్ర మిర్చి (కామారెడ్డి), వరి/పత్తి (కరీంనగర్) వ్యవసాయ ఉత్పత్తిదారులు,  చేనేత  బొమ్మల కార్మికులు (నిర్మల్) లాంటి వారికి  సకాలంలో వర్కింగ్​ క్యాపిటల్​ దొరకడం కీలకం. మేం ఇలాంటి వాళ్ల అవసరాలు తీరుస్తాం. హైదరాబాద్​లోనూ మాకు వందలాది మంది కస్టమర్లు ఉన్నారు" అని అన్నారు. కంపెనీ భారతదేశం అంతటా 175 కంటే ఎక్కువ శాఖలను ఏర్పాటు చేసింది.  వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్యను 500 శాఖలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.  సిబ్బందిని రెట్టింపు చేయనుంది.