
నిర్మల్, వెలుగు: కొత్త మాస్టర్ ప్లాన్ పేరిట నిర్మల్ మున్సిపల్ పరిధిలో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నిర్మల్ ఆర్డీఓ ఆఫీస్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. పాల్గొన్న మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ జోన్లో ఉన్న పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చి రైతులను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. భూ అక్రమాలతో బీఆర్ఎస్ నేతలు, వారి బంధువులు నిర్మల్ పట్టణ ప్రజలను నిండా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి మాస్టర్ ప్లాన్‌లో ఆ భూములను కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్‌గా మార్చి భారీ స్కాంకు తెరలేపారని ఆరోపించారు.
ఇండస్ట్రియల్ జోన్లో ఉండే సోఫినగర్ ప్రాంతాన్ని కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్‌గా మార్చి అక్కడి భూములు కొన్న నేతలు, ఆ భూముల విలువ అమాంతం పెంచి కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌కు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నామని ప్రకటించిన మంత్రి తిరిగి అదే తరహా లో కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం సరికాదన్నారు. గ్రీన్ జోన్లో చెరువులు, పంట పొలాలు, చెట్లు ఉన్నప్ప టీకీ వాటిని పూర్తిగా ఇండస్ట్రియల్ జోన్ పరిధిలోకి తేవడం తో రైతులకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పరిసర ప్రాంతాల రైతులతో పాటు బీజెపీ పార్లమెంట్ ఇన్చార్జ్ అయ్యన్న గారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్ రావుల రాంనాథ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.