మేఘా నిర్లక్ష్యంతోనే సుంకిశాల కూలింది..  ఏలేటి మహేశ్వర్​రెడ్డి

మేఘా నిర్లక్ష్యంతోనే సుంకిశాల కూలింది..  ఏలేటి మహేశ్వర్​రెడ్డి
  • ఆ కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలి
  • మేఘా సంస్థను  బ్లాక్‌ లిస్టులో పెట్టాలి
  • సుంకిశాల ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు 

హైదరాబాద్/ హాలియా, వెలుగు: మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ప్రాజెక్టులోని రిటైనింగ్​వాల్​ కూలిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.  ఆ కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేస్తున్న మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి, మేఘా కృష్ణారెడ్డి లైసెన్స్ రద్దు చేయాలని కోరారు.

మంగళవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల ప్రాజెక్టు వద్ద గోడ కూలిన ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హారీశ్​ బాబు, రామారావు పటేల్, టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు బయల్దేరారు. మధ్యాహ్నం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న బీజేపీ ప్రజాప్రతినిధులు.. కూలిన ప్రాంతాన్ని  పరిశీలించారు.

మేఘా సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది..

సుంకిశాల ఘటన రాష్ట్ర ప్రజలందరినీ విస్తుపోయేలా చేసిందని ఏలేటి మహేశ్వర్​రెడ్డి తెలిపారు.ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా సంస్థ నిర్లక్ష్యం ఉన్నట్టు స్పష్టమవుతున్నదన్నారు. ఆగస్టు 2న ప్రమాదం జరిగితే మీడియాలో వచ్చే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వాట‌ర్ బోర్డు నుంచి స‌మ‌గ్ర నివేదిక లేకుండానే సుంకిశాల ప్రమాదం చిన్నదే అని  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు ఎలా చెప్తారని ప్రశ్నించారు.

సుంకిశాలలో గోడకూలిన ఘటనపై  సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని ఎమ్మెల్యే హరీశ్​బాబు కోరారు. మేఘా కృష్ణారెడ్డి నెగ్లిజెన్సీతోనే ప్రాజెక్టు కూలిందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కోరారు. వారివెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్​రెడ్డి, రాష్ట నాయకులు శ్రీనివాస్​ గౌడ్​, పిల్లి రామరాజు, కంకణాల నివేదిత రెడ్డి, జిల్లా నాయకులు చెన్ను వెంకటనారాయణ రెడ్డి, బాలాజీనాయక్,​ తదితరులు పాల్గొన్నారు.