
- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి హెచ్సీయూ భూములు ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? చెప్పాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీజీఐఐసీ బాండ్స్ రూపంలో ఐసీఐసీఐ వద్ద నుంచి అప్పు తెచ్చారా? లేదా? చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుని రుణం తీసుకున్న మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం నుంచి నేరుగా రుణాలు తీసుకుంటే ఇబ్బంది అని ఎఫ్ఆర్ బీఎం పరిధిలోకి రాకుండా టీజీఐఐసీ ద్వారా రుణాలు తెచ్చారని ఆయన చెప్పారు. లోన్ కోసం రూ.170 కోట్లు కమీషన్ తెచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గతంలో బోఫోర్స్ కుంభకోణం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిందని, ఇప్పటికీ కాంగ్రెస్ కు అది మాయని మచ్చగా మారిందని విమర్శించారు. అప్పు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఈ అంశంపై ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు.
హెచ్సీయూ భూములపై ఇంత ఇష్యూ జరుగుతున్నా 18 రోజులుగా సీఎం కూడా స్పందించడం లేదన్నారు. అసెంబ్లీలో హెచ్సీయూ భూముల్లో గుంట నక్కలు ఉన్నాయన్నారని, వారెవరో మాత్రం ఆయన చెప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు బట్ట కాల్చి బీజేపీపై వేస్తున్నారని, అందుకే హెచ్సీయూ భూముల ఇష్యూలో బీజేపీ ఎంపీ ఉన్నారని చెబుతున్నారని ఆరోపించారు. అదే నిజమైతే ఆ ఎంపీ పేరు ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే పేరు చెప్పాలని డిమాండ్ చేశారు.