ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితుల ర్యాలీ

ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితుల ర్యాలీ

అల్వాల్, వెలుగు:  ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నివాసాలు కోల్పోతున్న తమకు భూమితో పాటు ఇంటి నిర్మాణ నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ బొల్లారం నుంచి లక్డావాలా బస్ స్టాప్ వరకు ఆదివారం నిర్వాసితులు  ర్యాలీ చేపట్టారు. కంటోన్మెంట్ బొల్లారం లోని బీ3 ప్రాంతాల్లో  ఉంటున్న తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మూడు తరాలుగా కుటుంబాలతో ఇక్కడే  ఉంటున్నామన్నారు. 

కంటోన్మెంట్ లోని ఇతర ప్రాంతాలలో భూమితో పాటు నిర్మాణానికి కూడా నష్టపరిహారాన్ని అందిస్తున్నారని,  తమకు కేవలం నిర్మాణానికి నష్టపరిహారం అందిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారని, బొల్లారంలో గ్రామసభ నిర్వహించి తమ అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తమ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అధికారులు న్యాయం చేయాలని తగిన నష్టపరిహారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.