
- ప్రాణహితకు వరద పెరుగుతున్నా.. నీళ్ల లిఫ్టింగ్ పెంచుతలే
- నదిలో రోజుకు 30 వేల క్యూసెక్కుల వరద.. మేడిగడ్డ బ్యారేజీలో 11 టీఎంసీలు
- మొత్తం 17 మోటార్లలో పనిచేస్తున్నవి ఆరేడే..
- గతేడాది పంప్‌హౌస్ మునిగి తుక్కయిన మోటార్ల స్థానంలో కొత్తవి పెట్టలే
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రాణహితకు మస్తు వరద వస్తున్నా.. మేడిగడ్డ వద్ద ఎత్తిపోతలు మాత్రం పెరగడం లేదు. రోజుకు 3 టీఎంసీలను తరలించే సామర్థ్యం ఉన్నా.. కేవలం అర టీఎంసీనే లిఫ్ట్ చేస్తున్నారు. వారం రోజుల్లో మేడిగడ్డ బ్యారేజీ నుంచి కేవలం 4.5 టీఎంసీలను మాత్రమే ఎత్తిపోశారు. రోజుకు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నా.. లిఫ్టింగ్‌ను పెంచడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహితలో వరద పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలోనూ ప్రస్తుతం 16 టీఎంసీలకు గాను 11 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. మరోవైపు రాష్ట్రంలో వర్షాల్లేక శ్రీరాంసాగర్ సహా ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి ప్రభుత్వం చెప్పినట్లు రోజూ 2.5 నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చు. కానీ కొద్దిరోజులుగా మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి రోజుకు ఆరు, ఏడు మోటర్లనే నడిపిస్తున్నారు. కేవలం మధ్యాహ్నం పూట అర టీఎంసీ నుంచి టీఎంసీలోపే వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన 17 మోటార్లను ఒకేసారి రన్ చేస్తే.. రోజూ 3 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేసే అవకాశమున్నా ఎందుకు చేయడం లేదనే ప్రశ్న వినిపిస్తుంది.
గతేడాది వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. పంప్‌హౌస్ ప్రొటెక్షన్ వాల్ కూలిపోయి భారీ క్రేన్లు, సిమెంట్ గోడలు పడిపోవడంతో ఆరు మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. వీటిని రిపేర్ చేసినా పనికి రావని సర్కారుకు ఇంజినీర్లు రిపోర్ట్ చేశారు. దీంతో ఆస్ట్రియా నుంచి రూ.300 కోట్ల విలువ చేసే ఆరు మోటార్లు తెప్పించాలని నిర్ణయించి, ఆర్డర్ కూడా పెట్టారు. కానీ ఏమైందో ఏమో తెలియదుగానీ ఈ మోటార్లు ఇప్పటికీ కన్నెపల్లి పంప్‌హౌస్ సైట్‌కి చేరుకోలేదు. ఈ ఆరు మోటార్లు లేక అడిషనల్టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయడం సాధ్యపడట్లేదు. మిగిలిన 11 మోటార్లను రిపేర్ చేసినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో ట్రయల్ రన్ చేపట్టామని, మొత్తం 11 మోటార్లు పనిచేస్తున్నాయని ప్రకటించారు. తీరా ఇప్పుడు వాటర్ లిఫ్టింగ్ చేసే సమయానికి వచ్చేసరికి 7 మోటార్లు మాత్రమే నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. మరో 4 మోటార్లు పూర్తిస్థాయిలో వాటర్ లిఫ్ట్ చేయట్లేదు. దీనివల్ల మరో టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయడం ఆఫీసర్లకు సాధ్యపడట్లేదు. ఈ విషయాలు బయటపడకూడదనే ఇప్పటికీ రహస్యంగానే వాటర్ లిఫ్టింగ్ చేస్తున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వట్లేదు.
రాత్రిపూట మోటార్లు బంద్
ప్రాణహితలో ఇన్‌ఫ్లో పెరిగినందున కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి పంటలను కాపాడుతామని సీఎం కేసీఆర్ ఇటీవల చెప్పారు. ఆయన ఆదేశాలతో అధికారులు ఈ నెల 3న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 4 మోటర్లను ఆన్ చేసి వాటర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మోటర్ల సంఖ్యను ఏడుకు పెంచారు. ఆరు మోటర్లను రోజంతా నిరంతరాయంగా నడిపితే ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ రాత్రిపూట మోటార్లను బంద్పెట్టడంతో సగటున రోజుకు ఒక టీఎంసీ కూడా ఎత్తిపోయలేకపోయారు. నిజానికి 17 మోటర్లను నిరంతరాయంగా నడిపితే రోజుకు 3 టీఎంసీల చొప్పున వారం రోజుల్లో 21 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉండేది. కానీ గడిచిన వారం రోజుల్లో కన్నెపల్లి నుంచి కేవలం 4.51 టీఎంసీల వాటర్‌ను మాత్రమే అన్నారం బ్యారేజ్‌కి లిఫ్ట్ చేసినట్లు ఇంజినీర్లు చెప్తున్నారు.