
కుత్బుల్లాపూర్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలోని ‘శ్రీ సాయి మణికంఠ రైజ్’ అపార్టమెంట్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో అక్బర్ బంతి తీయడానికి వెళ్లాడు. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్బర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్బర్ వయసు 39 సంవత్సరాలు.
పిల్లలు సెల్లార్లో ఆడుకుంటుండగా బంతి లిఫ్ట్ గుంతలో పడింది. బంతి ఇలా పడిపోయిందని.. తీయాలని అక్బర్ను పిల్లలు అడిగారు. అక్బర్ బంతి తీస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా వచ్చి అక్బర్ మెడపై పడింది. అప్రమత్తమై పవర్ సప్లై ఆఫ్ చేసినప్పటికీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఈ విషాద ఘటనతో అక్బర్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం తెలిసి స్పాట్కు చేరుకున్నారు.
ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న లిఫ్ట్ యాక్ట్ -2025ను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. లిఫ్ట్ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడంతో చాలా మంది లిఫ్ట్ ఇండస్ట్రీ ఆపరేటర్లు.. స్పీడ్ గవర్నర్లు, ఎమర్జెన్సీ బ్రేకులు వంటి సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
గతంలో లిఫ్ట్ విధానంపై ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని ప్రతిపాదించింది. ఆ విధానాన్ని రూపొందించిన ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ విభాగం అధికారులు తిరిగి అధ్యయనం చేస్తున్నారు. మరికొన్ని ప్రతిపాదనలతో ముసాయిదా సిద్ధం చేస్తున్నారు. త్వరలో దీనికి తుది రూపం ఇవ్వనున్నారు. ఇది కార్యరూపం దాల్చగానే మరికొద్ది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిఫ్ట్ పాలసీని అమలు చేయనున్నది. ఇది అమల్లోకి రాగానే లిఫ్ట్ పాలసీలో లిఫ్ట్ ఇండస్ట్రీలు, స్పేర్ పార్ట్స్తయారు చేసే సంస్థలు, భవన యజమానులు లిఫ్ట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి చేయనున్నారు