- ప్రైమరీ స్కూళ్లలో 11 వేల టీచర్ పోస్టులు ఖాళీ
- మరో 7 వేల మందికి హైస్కూళ్లలో డిప్యుటేషన్
- చాలా స్కూళ్లలో టీచర్లు లేక సాగని బోధన
- టాస్క్‌ఫోర్స్ కమిటీలతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి
మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం ప్రైమరీ స్కూల్స్టూడెంట్లకు లాంగ్వేజ్, మ్యాథ్స్‌లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రవేశపెట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్–తొలిమెట్టు) ప్రోగ్రాంతో టీచర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది స్కూళ్లలో టీచర్ల కొరత ఉండడంతో ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నారు. చాలా చోట్ల సరిపడా క్లాస్ రూంలు, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో పిల్లలకు చదువు చెప్పేందుకు నానా పాట్లు పడుతున్నారు. పైగా ఇప్పటికే వివిధ స్థాయిల్లో టీచర్లపై పర్యవేక్షణ ఉండగా.. ప్రభుత్వం ఎఫ్ఎల్ఎన్ అమలు పేరుతో కొత్తగా డిస్ట్రిక్ట్ అకడమిక్ టాస్క్‌ఫోర్స్(డీఏటీఎఫ్) కమిటీలను వేసి మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోతున్నారు. స్కూళ్లలో టీచర్లను నియమించడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎఫ్ఎల్ఎన్ అమలు చేయాలని, టీచర్లపై పెత్తనం చెలాయిస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీలను రద్దు చేయాలని టీచర్యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
ఎఫ్ఎల్ఎన్ అమలు ఇలా..
ప్రైమరీ స్కూళ్లలో 75 శాతానికిపైగా చిన్నారులు చదవలేని, రాయలేని పరిస్థితిలో ఉన్నారు. కరోనా ఎఫెక్ట్‌తో రెండేండ్లు ఏమీ చదవకుండానే పై క్లాస్‌లకు వెళ్లారు. వారికి చదవడం, రాయడం, గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం వంటివి చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాల పెంపు, గుణాత్మకమైన మార్పు కోసం ప్రభుత్వం ఎఫ్ఎల్ఎన్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆగస్టు 15న రాష్ట్రంలోని 23,179 ప్రైమరీ స్కూళ్లలో ఇది ప్రారంభమైంది. 52,708 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వగా, మొత్తం 11,24,563 మంది స్టూడెంట్లు లబ్ధి పొందుతున్నారు. విద్యాసంవత్సరంలో 220 రోజుల పని దినాలకు ఎఫ్ఎల్ఎన్ 140 రోజులు కొనసాగుతుంది. వారానికి ఐదు రోజులు బోధనాభ్యాసం, ఒకరోజు రివిజన్, వారానికోసారి టెస్ట్ పెట్టి వాల్యుయేషన్ చేయాలి.
ఉన్న పనులతోనే ఉక్కిరిబిక్కిరి
రాష్ట్రవ్యాప్తంగా ప్రైమరీ స్కూళ్లలో 11 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. మరో ఏడు వేల మంది టీచర్లను డిప్యూటేషన్‌పై హైస్కూళ్లకు పంపారు. దీంతో మెజారిటీ స్కూళ్లు ఒక్కరు లేదా ఇద్దరు టీచర్లతోనే నడుస్తున్నాయి. ఒకవైపు పిల్లలకు పాఠాలు చెప్పడం, మరోవైపు టీఎల్ఎం తయారీ, పీరియడ్ ప్లాన్, వీకెండ్, మంత్లీ రిపోర్టులు, రివ్యూ మీటింగులతో పాటు రోజువారి కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినప్పటికీ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంను ముందుకు తీసుకుపోవడానికి టీచర్లు తమ శక్తి మేరకు కష్టపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పర్యవేక్షణ చేస్తున్నారు. కాంప్లెక్స్ స్థాయిలో టీచర్ల వారీగా రివ్యూ, మండల స్థాయిలో నెలకోసారి హెచ్ఎంలతో సమీక్ష, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మండలాల వారీగా రివ్యూ, స్టేట్ లెవల్లో జిల్లాలవారీగా ప్రగతి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇటీవల డిస్ట్రిక్ట్ అకడమిక్ టాస్క్‌ఫోర్స్ పేరిట మరొక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై టీచర్లు మండిపడుతున్నారు.
ప్రైమరీ స్కూళ్లపై పట్టింపేదీ?
ప్రైమరీ స్కూళ్లను బలోపేతం చేయాలని టీచర్యూనియన్లు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్కూళ్లలో ఇదివరకు ఉన్న స్వీపర్లను, స్కావెంజర్లను, విద్యావాలంటీర్లను సర్కారు తొలగించింది. సరిపడా టీచర్లు, క్లాస్‌రూమ్‌లు లేకుండా, సౌలత్లు మెరుగుపర్చకుండా ఎఫ్ఎల్ఎన్ పేరుతో ఒత్తిడికి గురిచేయడం తగదంటున్నారు. ఉదాహరణకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ప్రైమరీ స్కూల్లో 127 మంది స్టూడెంట్లకు ముగ్గురు టీచర్లు ఉన్నారు. ఇక్కడ మరో ఇద్దరు టీచర్లు అవసరమైనప్పటికీ నియమించడం లేదు. ఈ ముగ్గురు ఓవైపు రోజువారీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు ఎఫ్ఎల్ఎన్ను అమలు చేయడం కష్టతరంగా మారిందని అంటున్నారు. అవసరానికి మించి పర్యవేక్షణ పెంచడం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోగా క్లాస్ రూంలో టీచర్లు స్వేచ్ఛగా బోధించలేకపోతున్నారని, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా, వాటిని పరిష్కరించకుండా టీచర్లను బద్నాం చేసే చర్యలను ప్రశ్నిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయకుండానే..
ఏదైనా కొత్త ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు ఒక దగ్గర పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసి దాని ఫలితాల ఆధారంగా ఇతర చోట్ల అమలు చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కానీ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంను ఇలా అమలు చేసి ఫలితాలను సమీక్షించిన దాఖలాలు లేవు. బోధన, అభ్యసన ప్రక్రియ స్థానిక పరిస్థితులు, స్టూడెంట్ల స్థాయిని బట్టి వివిధ రకాల పద్ధతుల్లో కొనసాగుతుందని టీచర్యూనియన్ల నేతలు అంటున్నారు. ఇది టీచర్, అక్కడి స్టూడెంట్ల స్థాయిని బట్టి మారుతుందని పేర్కొంటున్నారు. కానీ టాస్క్‌ఫోర్స్ కమిటీ పేరుతో ఒకే మూసలో బోధన ప్రక్రియ సాగాలని టీచర్లపై అనవసరంగా ఒత్తిడి పెంచుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంను పర్యవేక్షించడానికి నియమించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలను రద్దు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటు స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీలను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టడం గమనార్హం. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన శనివారం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ టీచర్లు, యూనియన్ లీడర్లు మాత్రం సంతృప్తి చెందడం లేదు. ఈ కమిటీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీలు రద్దు చేయాలె
ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం పర్యవేక్షణ పేరుతో అధికారుల బృందం స్కూళ్లలో పర్యటించడం వల్ల టీచర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ కొనసాగుతున్నప్పటికీ మరొక టాస్క్ఫోర్స్బృందాన్ని ఏర్పాటు చేయడంతో మనోవేదనకు గురవుతున్నారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ కమిటీని రద్దు చేయాలి. ప్రభుత్వం స్కూళ్లను బలోపేతం చేసి, ఖాళీలను భర్తీ చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. – బండి రమేశ్, తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి