అన్ని రాష్ట్రాలలోనూ కుల ప్రాబల్యం బాగా పెరుగుతున్న మాట వాస్తవం. ఈ కుల పోరాటం ప్రస్తుత రాజకీయాలలో మరింత ప్రబలుతున్నది. తెలంగాణాలోని ప్రజలు చాలాకాలం, కులాల కుంపటిలో చలి కాచుకోలేదు. చరిత్ర తిరగేస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉండి కూడా వెలమలు, బ్రాహ్మణులు, వెనకబడినవారు, దళితులు రాజకీయంగా పరిణతిని ప్రదర్శించారు. ముఖ్యంగా అన్నిరకాల పార్టీ వర్గాలు అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రముఖ స్థానాన్నే పొందారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి కావటం అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో కులాల ప్రాబల్యం అంతగా లేకపోవటం వల్లనే కదా.
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా నుంచి పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి కావటం ఒక విధంగా ఆ కారణం వల్లనే కదా. వెంగళరావు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో, అటుతర్వాత కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా రాజ్యమేలటం అందువల్లనే జరిగింది. కొన్ని జిల్లాలలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా అనేక కులాలు తెలంగాణాలో రాజకీయాలను శాసించే స్థాయిలోనే ఉండేవి.
కులాల ప్రభావం ఆ రోజుల్లో ప్రజలమీద తక్కువగా ఉండటం వల్లనే కొందరు నాయకులు తక్కువ సంఖ్య ఉన్న కులాల నుంచి కూడా రాజకీయాలలో బాగా పైకి ఎదిగినమాట ఎవరూ కాదనలేరు. రెడ్లు, కమ్మవారు, ఇతర కులాలవారు ముఖ్యంగా కాపులు, ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఖమ్మం జిల్లాను ఒక ఉదాహరణగా పరిగణనలోకి తీసుకుంటే అప్పట్లో బ్రాహ్మణ నాయకులు జమలాపురం కేశవరావు, బొమ్మకంటి సత్యనారాయణరావు, కొలిపాక కిషన్‌రావు జిల్లా స్థాయిలో కాంగ్రెస్‌లో ఉండి రాజకీయంగా ఎదిగారు.
నాయకులు మార్గదర్శకంగా నిలవాలి
దామోదరం సంజీవయ్య రవీంద్ర భారతిలోని కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రిగా కాలినడకన రావటం..విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళం చూసి ఆదర్శంగా చెప్పుకొనేవాళ్ళం. కొందరు విద్యార్థులు ఢిల్లీలో ట్రైనింగ్ అటెండ్ చేసి తిరిగి రావటానికి రైలు టికెట్లు దొరకకపోతే అప్పట్లో డిప్యూటీ మంత్రిగా ఉన్న వెంకటస్వామిని కలిసి సహాయం కోరితే ఒక చిరునవ్వుతో కాఫీలతో వారిని ఆదరించి టికెట్లు కోసం వారి పీఏకు ప్రత్యేకంగా పురమాయించేవారు. రైలు ప్రయాణాన్ని సులభతరం చేసిన ఆనాటి సహాయం ఇప్పుడు పెద్దవారిగా మారినవారు ఎలా మరిచిపోగలరు?
ఆనాటి నాయకులు అందరికీ అందుబాటులో ఉండి సామాన్యులకు ఏవిధంగా సహాయపడాలి అనే తీవ్రమైన కోరికతో రాజకీయాలలో ప్రవేశించి, కష్ట నష్టాలు ఓర్చుకొని, ఆర్థికంగా ఎదురుదెబ్బలు తిని పైకి రావటం వల్ల ప్రజల దగ్గరకు రాగలిగారు. - ప్రేమపాత్రులయ్యారు. ఏ నాయకుడు ఏ కులానికి చెందినవాడు? ఏ మతానికి చెందినవాడు? అని అప్పటి ప్రజలు ఏనాడూ తరిచి చూడలేదు - ఆ ప్రభావాలకు లోనుకాలేదు.
అన్ని రకాలుగా అభివృద్ధి పొందటమే కాకుండా మంచి చెడులు గుర్తించటంతో పాటు ‘నాలెడ్డి సాసైటీ’గా తామంతట తాము భుజాలు చరుచుకోవటానికి అలవాటుపడ్డ ఈ కాలంలో కుల విభజనను, కులాల హెచ్చుతగ్గులను, మతాల ప్రాబల్యాన్ని ముఖ్యంగా ఎన్నికల సమయంలో, అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ సీట్లు కేటాయిస్తున్నప్పుడు వీటిని పరిగణనలోకి తీసుకోవటం, ఓట్లు దండుకోవటానికి వాటిని పదేపదే ఉపయోగించుకోవటం, ప్రచారం చేసుకోవటం ఎంతవరకు సమంజసం? బుద్ధి జీవులు, సమాజ శ్రేయస్సు కోరేవారు, రాజకీయాల్లో ద్వేషభావాలు ఉండకూడదని గాఢంగా నమ్మేవారు ఆలోచించటమే కాదు మార్గదర్శకంగా నిలవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది.
అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలి
సమాజంలో అణగారిన వర్గాలకు, పేదవారికి పావర్టీలైన్’ను అధిగమించటానికి బలంగా చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకూ ఉంది. కానీ, ఆ అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయటానికి రాజకీయ పార్టీలూ, పాలకులూ ప్రయత్నించటం ‘సమాజ ఉద్ధరణ’ కాదు- ‘సమాజ నిర్మూలన’గా ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నవారైనా అనుకోక తప్పదు. గోరా అనే సంఘ సంస్కర్త దశాబ్దాల కిందట వన్‌మ్యాన్ ఆర్మీగా తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి- అప్పటివారికి మాటలు కాదు చేతలు ముఖ్యం అని చూపగలిగారు.
అంబేద్కర్, కాన్షీరాం, జ్యోతీరావు ఫూలే లాంటివారు మన దేశంలోని ఎన్నో రాష్ట్రాలలో సమాజాన్ని సంస్కరించటానికి - జీవనపథంలో 'లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’ను ఏర్పరచటానికి శతవిధాల ప్రయత్నించారు. జాతిపిత మహాత్మా గాంధీ - కేవలం స్వాతంత్ర సముపార్జనకే కాదు, ఇలాంటి సంస్కరణలకు కూడా ఆద్యుడు. ఇంతటి మహత్తరమైన చరిత్ర కలిగిన మనం పురోగమనానికి ‘ఫుల్‌స్టాప్’ పెట్టి తిరోగమనమే ఎన్నికలలో గెలవటానికి, అధికారం సాధించుకోవటానికి మార్గమని స్వలాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని - రాజ్యాంగాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.
కులంకాదు పట్టించుకోవాల్సింది.. - సమాజంలో అందరూ అన్నిట్లోనూ సమానత్వం సాధించటం పట్టించుకోవాలి. అంతరాలు అంతరించినప్పుడే నవ సమాజానికి, నిజమైన ప్రజాస్వామ్యానికి, ‘అధికారం’ అందరికీ అందే మార్గం సుగమం అవుతుంది. ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేయకుండా ఎన్నికల్లో - ఏదోవిధంగా గెలవటానికి కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా తామున్న ఇంటికి తామే నిప్పు అంటించుకున్నట్లవుతుంది. ఆ ముప్పును గమనించి తొలగించాలి.
పేదల ప్రతినిధిగా కాకా వెంకటస్వామి
బొమ్మకంటి మధిర నియోజకవర్గం నుంచి శాసనసభకు ఏపీ ఏర్పడిన తర్వాత గెలిచారు. అంతకుమునుపు ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయిలో రాష్ట్రం కావటానికి ప్రయత్నించి నీలం సంజీవరెడ్డి, గోపాలరెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చిన ముఖ్యుల్లో ఒకరని చెపుతారు. సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రముఖ తెలంగాణా నాయకులలో ఆయన అనుయాయులు చాలామంది ఎదుగుదలకు ఆయన కృషి చేశారు. వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి నాయకులు ఎదిగింది ఆయన టైంలోనే.
బ్రాహ్మణ నాయకత్వం బొమ్మకంటితో ఖమ్మం జిల్లాలో ముగిసిన తర్వాత వెంగళరావు రాజకీయంగా ప్రముఖ స్థానం వహించినప్పుడు మళ్లీ బ్రాహ్మణుల్లోంచి కౌటూరి దుర్గాప్రసాదరావు అనే యువ నాయకుడిని ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆయన చాలా కొద్ది తేడాతో అప్పటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడి చేతిలో ఓడిపోవటం జరిగింది. దానితో జిల్లాలో రాజకీయాలలో నాయకత్వం వహించిన ఆ కులంవారు కనుమరుగయ్యారు. ఇదంతా ఎందుకు అంటే - తెలంగాణాలో తక్కువ సంఖ్యలో ఉన్న కులాలవారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రాముఖ్యత లభించింది.
ముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ముఖ్యమంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎంపిక కావటం అంటే సామాన్యమైన విషయం కాదు. అతని ప్రజ్ఞాపాటవాలు ఆంధ్రా విడిపోకమునుపు మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడే అందరూ గుర్తించారు. అంతెందుకు వెంకటస్వామి (కాకా) లాంటి ప్రముఖ తెలంగాణ నాయకుడు ఆ రోజుల్లోనే పేదల ప్రతినిధిగా గౌరవాభిమానాలు పొందటంతో పాటు విశేషంగా వారి అభివృద్ధికి కృషి చేశారు. అసాధారణ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలలో గుర్తింపు పొందిన వ్యక్తిగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఏ కులానికి చెందిన నాయకుడు అని అప్పటి ప్రజలు ఆరా తీయలేదు. వారికి కావల్సింది సేవ, సహాయం, సహకారాలతో పాటు చట్టబద్ధమైన పాలన.
రావులపాటి సీతారాంరావు ఐపీఎస్ (రిటైర్డ్)