చెత్త వల్నరబుల్ పాయింట్లను తొలగిస్తం : బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్

చెత్త వల్నరబుల్ పాయింట్లను తొలగిస్తం : బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్
  • దుర్గం చెరువు వద్ద అభివృద్ధి పనుల పరిశీలన
  • తోపుడు బండ్లను తొలగించాలని ఆదేశాలు

గచ్చిబౌలి, వెలుగు : సిటీలో దశల వారీగా చెత్త వల్నరబుల్​ పాయింట్లను తొలగించాలని బల్దియా నిర్ణయించింది.  శానిటేషన్​ అధికారులను కమిషనర్​రోనాల్డ్​రాస్​ ఆదేశించారు.  శేరిలింగంపల్లి జోన్​ పరిధిలోని డెవలప్​మెంట్​వర్క్స్​, ఇతర సమస్యలపై జోనల్​ఆఫీస్​లో బుధవారం అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు.  జోనల్​పరిధిలోని చందానగర్​, శేరిలింగంపల్లి, యూసఫ్​గూడ, పటాన్​చెరువు రామచంద్రపురం సర్కిళ్లలో శానిటేషన్  పనులు, చెత్తను ఎస్​టీపీలకు తరలించే విధానం, చెత్త సేకరణకు తిరిగే ఆటోల పనితీరును కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 సీ అండ్ డీ మెటిరియల్​తరలింపుపైనా చర్చించారు. అదేవిధంగా ఎస్ఎఫ్​ఏల సంఖ్య, శానిటేషన్  కార్మికుల హాజరుపై  ఆరా తీశారు.  గేటెడ్​ కమ్యూనిటీల్లో చెత్తను సేకరించేందుకు డస్ట్​బిన్​లను ఏర్పాటు చేయాలని సూచించారు.  జోనల్​లో వాడకంలోలేని టాయిలెట్లను తొలగించాలని ఆదేశించారు. అంతకు ముందు జోనల్​కమిషనర్​,  శానిటేషన్ , టౌన్​ప్లానింగ్​అధికారులతో కలిసి దుర్గం చెరువును పరిశీలించారు. చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో సరిహద్దు గోడ, నడక మార్గంలో జరుగుతున్న ఇంజనీరింగ్, శానిటేషన్  పనులను పరిశీలించారు.

 ఆపై పలు సూచనలు చేశారు. దుర్గం చెరువు  ఎంట్రెన్స్​ వద్ద డంపర్​ బిన్స్​అండ్​ ఫుడ్​ ఐటమ్స్​​ను చూసి  వాటిని వెంటనే తొలగించాలని కమిషనర్​ అధికారులకు తెలిపారు.  ఫుట్​పాత్​లపై స్టీల్​రెయిల్స్​ నిర్మించాలని, వీటితో ఫుట్​పాత్​లు అక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. దుర్గం చెరువు వద్ద స్ర్టీట్​ఫర్నిచర్​ను వినూత్న పద్ధతిలో అందిస్తే మంచి వాతావరణాన్ని సృష్టించవచ్చన్నారు. ఈ సమావేశంలో  జోనల్​ కమిషనర్​ స్నేహ శబరీశ్​, శానిటేషన్​ అడిషనల్​ కమిషనర్​ ఉపేందర్​రెడ్డి, ఇంజనీరింగ్​, శానిటేషన్​, టౌన్​ ప్లానింగ్​ అధికారులు పాల్గొన్నారు. 

ఫుట్ పాత్​ లపై ఆక్రమణలు లేకుండా చూడండి 

దుర్గం చెరువు వద్ద అభివృద్ధి పనులను పరిశీలిస్తుండగా.. కమిషనర్​అక్కడే ఫుట్​పాత్​లపై, రోడ్డు పక్కన తోపుడు బండ్లను చూసిన వాటిని తొలగించాలని ఆదేశించారు. దీంతో అధికారుల సూచనలతో ఫుట్ పాత్  వ్యాపారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బల్దియా టాస్క్​ఫోర్స్​సిబ్బంది తోపుడు బండ్లు, పుట్​పాత్​పై వ్యాపారాలు చేసుకునే మూసి ఉన్న బండ్లను తొలగించారు. దీంతో తోపుడు బండ్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇస్తే వాటిని తీసుకువెళ్లే వారమన్నారు.

ఉపాధి లేకనే అప్పులు చేసి తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.  ఇలా తమ బండ్లను తొలగిస్తే బతుకుదెరువుపై దెబ్బ పడుతుందని వాపోయారు. ఐటీసీ కోహినూర్​ హోటల్​ వద్ద ఫుత్​పాత్​పై ఫుడ్​ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటిని అక్కడే వ్యాపారం చేసుకునేలా సీఎం రేవంత్​రెడ్డి భరోసా ఇచ్చారని, కానీ అధికారులు చిరువ్యాపారులపై ప్రతాపం చూపించడం ఎంత వరకు కరెక్ట్​ అని మండిపడ్డారు.