నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో నియామకాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ప్రజలను మభ్యపెట్టి, అధికారం చేజిక్కించుకున్న పాలకులు.. నిరుద్యోగులను పట్టించుకోవడం మానేశారు. బన్సల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 92 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 40 వేల ఉద్యోగాలు మాత్రమే నింపి చేతులు దులుపుకున్నారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 10వ తరగతి నుంచి పీజీ వరకు పీహెచ్డీ వరకు చదివిన వాళ్లు ఉన్నారు. ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో యువత చాలా మంది కష్టాలతో జీవితాలను నెట్టుకొస్తున్న పరిస్థితి ఉన్నది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో యువత పెళ్లిండ్లు కూడా 30 తరవాతనే చేసుకుంటున్న పరిస్థితి. ఇంకో వైపు10 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పనులు చేస్తున్నారు. ఇందులో ఎలక్ట్రీషియన్లు, ఫ్లోరింగు వేసే వాళ్లు, గోడలు కట్టే మేస్త్రీలు, సెంట్రింగ్చేసేవాళ్లు, సీలింగ్ చేసే వాళ్లు, నర్సులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, హోటల్ పరిశ్రమలో పని చేసేవాళ్లు, పరిశ్రమల్లో పనిచేసే లేబర్స్ఇలా చాలా మంది ఉన్నారు.
బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. వీళ్లంతా.. ఏమీ చీప్ లేబర్ కాదు. వీళ్లలో సగం మంది కంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న పనివాళ్లే. వీళ్లు నెలకు 20,000 నుంచి లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇంకో వైపు తెలంగాణ యువత నిర్వీర్యంగా ఎలాంటి పనులు లేకుండా ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటూ గ్రామాల్లో ఉంటున్నారు. ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతి గల్లీలో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ యువతను తాగుడుకు బానిస చేసి వారిని పనికిరాకుండా తయారు చేస్తున్నది. నాణ్యమైన విద్య లేకపోవడం, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, అవసరమైన సలహాలు, సహకారం లేకపోవడం తెలంగాణలో నిరుద్యోగానికి గల ప్రధాన కారణాలు.
ఉపాధి, ఉద్యోగాల కల్పన
ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే.. ఐదు సంవత్సరాలలో వివిధ రంగాలలో తెలంగాణలో 40 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. రోడ్లు, రైల్వేలు, వంతెనలు, విద్యుత్ పరిశ్రమలాంటి మౌలిక సదుపాయాల కల్పనలో 3 లక్షలు, భవనాలు, కట్టడాల రంగంలో 4 లక్షలు, టెక్స్టైల్2 లక్షలు, రవాణా, సరుకుల పంపిణీ లక్ష, రిటేల్దుకాణాలు, ఫుడ్‌కోర్టులు 2 లక్షలు, విద్యకు సంబంధించి 2 లక్షలు, ఫుడ్‌ప్రాసెసింగ్ 4 లక్షలు, వైద్యం 2 లక్షలు, కంప్యూటర్లక్ష, సాఫ్ట్వేర్6 లక్షల మందికి, ఇతర పరిశ్రల్లో 8 లక్షలు, స్వయం ఉపాధి 2 లక్షలు, వ్యవసాయ పరిశ్రమలు లక్ష, కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, రైల్వే, మిలిటరీ ఉద్యోగాల్లో లక్ష మందికి, విదేశీ ఉద్యోగాల్లో లక్ష మందికి ఇలా.. మొత్తం 40 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.
నైపుణ్యాల నిధి అవసరం
రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి సమాచారాన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్లో నమోదు చేయాలి. వారి విద్య వారి ఇష్టమైన రంగం వారి అనుభవాలను మొదలగు సమాచారాన్ని కంప్యూటర్లో నమోదు చేయాలి. ఎప్పటికపుడు వారు నేర్చుకున్న కొత్త నైపుణ్యాలను కూడా చేర్చాలి. రాష్ట్రంలోని ప్రతి కంపెనీ, ప్రతి సంస్థ వారికి కావాల్సిన ఉద్యోగుల సంఖ్యను వారికి కావాల్సిన విద్యార్హతలను స్కిల్ బ్యాంకుకు ఇస్తే.. అలాంటి అర్హతలు ఉన్న నిరుద్యోగులను గుర్తించి ఆ కంపెనీలకు సరఫరా చేసే బాధ్యత స్కిల్ బ్యాంక్ తీసుకోవాలి. స్కిల్ బాంక్కు ఒక నిష్ణాతుడైన వ్యక్తిని సీఈవోగా నియమించాలి. దీన్ని ఒక ప్రభుత్వ సొసైటీగా ఏర్పరచాలి. సొసైటీని స్వతంత్రంగా నడపడానికి నిష్ణాతులైన 9 మందితో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించాలి. రాష్ట్రంలోని ప్రతి కంపెనీని, సంస్థలకు సంబంధించిన సమాచారం(పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకుంటూ) స్కిల్ బ్యాంక్ సాఫ్ట్వేర్ నమోదు చేయాలి. స్కిల్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలతో, సంస్థలతో చొరవ తీసుకుని సత్సంబంధాలు కల్గి ఉండి ఉద్యోగాల కల్పనను ముమ్మరం చేయాలి. పని కావాల్సిన కార్మికులకు కూడా ఈ స్కిల్ బ్యాంక్ లో నమోదు చేసుకొని పరిశ్రమలకు, కంపెనీలకు అనుసంధానం కావాలి. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతికంపెనీలో, సంస్థలో, పరిశ్రమలో కనీసం 60 శాతం ఉద్యోగాలను తెలంగాణ యువతకు మాత్రమే కేటాయించేటట్లు ప్రభుత్వం వారితో ఒప్పందం చేసుకోవాలి. కంపెనీలకు పూర్తి నైపుణ్యం ఉన్న అభ్యర్థులనే స్కిల్ బ్యాంకు వాళ్ల సరఫరా చేయాలి. దీనికి సంబంధించి ఒక ప్రభుత్వం చట్టం చేయాలి.
బడ్జెట్ అవసరాలు
ప్రతిపాదిత శాఖలు, డైరెక్టరేట్లు, స్కిల్బ్యాంకులకు అయ్యే బడ్జెట్ అంచనా వేస్తే.. పెద్దగా ఖర్చు ఏమీ కాదు. ఆయా రంగాల్లో నైపుణ్యాల శిక్షణకు రూ.12,748 కోట్లు, 15 లక్షల స్వయం ఉపాధి(30 శాతం సబ్సీడీతో 3 లక్షలు)కి 10 లక్షల యూనిట్‌కాస్ట్‌తో రూ.45 వేల కోట్లు మొత్తంగా రూ.57,748 కోట్లు ఖర్చవుతాయి. దీనికి అయిదేండ్లలో ఒక్క సంవత్సరానికి రూ. 11,600 కోట్లు ప్రభుత్వం కేటాయించాలి. అంటే బడ్జెట్ లో 4 శాతం నిధులు కేటాయిస్తే సరిపోతుంది. అంటే 5 సంవత్సరాల పాటు ఏటా బడ్జెట్ లో 4 శాతం కేటాయిస్తే మనం 40 లక్షల ఉద్యోగాలను కల్పించవచ్చు. వీరికి 70 శాతం బ్యాంకుల సహకారంతో లోన్లు ఇప్పించాలి. వారు స్థిరపడేవరకు స్కిల్ నిధి వారి సలహా సహకారాలు అందించాలి. తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, మేనిఫెస్టోలో పెడతామని ప్రతి రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వాలని ఎస్డీఎఫ్డిమాండ్ చేస్తున్నది.
నైపుణ్యాల అభివృద్ధి
దాదాపు 15 రంగాల్లో మన తెలంగాణ యువతకు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించాలి. దీనికి సంబంధించి లేబర్, ఉద్యోగ కల్పన, శిక్షణల శాఖను పూర్తిగా బలోపేతం చేయాలి. ఈ శాఖ కింద పది డైరెక్టరేటులను ఏర్పాటు చేయాలి. పది మంది నిష్ణాతులైన వారిని డైరెక్టర్లుగా నియమించాలి. ఆయా డైరెక్టరేట్లు వారికి కేటాయించిన రంగాలను వివరంగా అధ్యయనం చేసి ఉద్యోగాలను, ఉపాధిని కల్పించాలి. దానికి తగ్గ నైపుణ్య శిక్షణలను నిరుద్యోగులకు కల్పించాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కిల్ సెంటర్‌ను స్థాపించాలి. శిక్షణలు తీసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి. కాలేజీల్లో ఉన్నప్పుడే విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ఇంగ్లీషు భాష, కమ్యూనికేషన్, ప్రవర్తన నియమావళి మీద పూర్తి శిక్షణ ఉండేటట్లు ఇంటర్మీడియట్ సిలబస్ లో చేర్చాలి.
- ఆకునూరి మురళి,సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్