
ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌లో టాప్ ప్లేస్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ చేరుకోగా.. ఆ జట్టుతో టైటిల్ ఫైట్‌లో తలపడే టీమ్‌ను తేల్చేందుకు గురువారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ అమ్మాయిలు అమీతుమీ తేల్చుకోనున్నారు. ఢిల్లీతో సమానంగా 10 పాయింట్లు నెగ్గినా.. రన్‌రేట్ కారణంగా టాప్ ప్లేస్ కోల్పోయిన ముంబై.. ఈ పోరులో జెయింట్స్ పని పట్టాలని ఆశిస్తోంది. ఈ సీజన్‌లో గుజరాత్‌తో తలపడ్డ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, సివర్ బ్రంట్, ఆల్‌రౌండర్లు కెర్, హేలీ ఫామ్‌లో ఉన్నారు. గుజరాత్ జట్టులో కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్‌తో పాటు హర్లీన్, బెత్ మూనీ రాణిస్తున్నారు.