సారూ.. మా భూములు లాక్కోవద్దు

సారూ.. మా భూములు లాక్కోవద్దు

ఎల్కతుర్తి, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ ఎక్స్​టెన్షన్​క్యాంపస్ ఏర్పాటుకు తమ భూములు లాక్కోవద్దని అసైండ్ భూముల లబ్ధిదారులు తహసీల్దార్ జగత్ సింగ్ ను వేడుకున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని సర్వేనంబర్ 381, 385, 389, 392 లో అసైండ్ భూములు, పట్టా భూముల రైతులతో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి రైతు వేదికలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎల్కతుర్తిలో క్యాంపస్ ఏర్పాటు చేస్తే ఎడ్యుకేషన్ పరంగా మంచి గుర్తింపు ఉంటుందని, పిల్లలకు మంచి చదువుతోపాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.‌ 

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 50 ఏండ్లుగా ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని, దయచేసి మా పొట్ట మీద కొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని, లబ్ధిదారులు పునః పరిశీలించాలని తహసీల్దార్ సూచించారు. సమావేశంలో ఆర్ఐ సదానందం, ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. సీఐ పులి రమేశ్ ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.