చీరల పంపిణీ రసాభాస..ప్రశ్నించిన వారికి చీరలివ్వొద్దు

ఎల్కతుర్తి, వెలుగు: ‘‘మీరు మా మండలం నుంచి జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్​ అయ్యారు. కానీ, మా మండలానికి మాత్రం ఏమీ చేయడం లేదు. మీ సొంత మండలమైన భీమదేవరపల్లికి నిధులు తీసుకెళ్తున్నారు. ఇన్ని రోజులు ఓపిక పట్టినం. ఇక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేని ఒప్పిస్తరా?, ఎమ్మెల్సీతో మాట్లాడుతరా? మీ ఇష్టం. ఇవ్వాళ ఎట్టి పరిస్థితుల్లో మీరు నిధులు కేటాయించాలి’’ అని బతుకమ్మ చీరల పంపిణీకి వచ్చిన జడ్పీ చైర్మన్ ​మారెపల్లి సుధీర్​కుమార్​ను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్​ సర్పంచ్​ కొమ్మిడి నిరంజన్​రెడ్డి నిలదీశారు. ఆయనకు జనం కూడా జతకలవడంతో చీరల పంపిణీ రసాభాసగా మారింది. అయితే నిధులు, నాణ్యమైన చీరలపై మహిళలు ప్రశ్నించడంతో వారికి చీరలు ఇవ్వొద్దని జడ్పీ చైర్మన్ అధికారులను ఆదేశించడం చర్చనీయాంశమైంది.

నాలుగెకరాలు అమ్ముకున్న.. ఇంకెక్కడి నుంచి తెచ్చి పెట్టాలె

మండలంలో చీరల పంపిణీకి ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంపీపీ మేకల స్వప్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిరంజన్ రెడ్డి ఎల్కతుర్తిలో ఎదురవుతున్న ఇబ్బందులను జడ్పీ చైర్మన్​కు ఏకరువు పెట్టారు. ‘‘నిధులు లేక గ్రామంలో పనులు చేయలేకపోతున్నం. ఇప్పటికే నాలుగెకరాలు అమ్ముకున్న. ఇంకా ఎక్కడి నుంచి పైసలు తెచ్చిపెట్టాలె?. మీరు మా మండలం నుంచి గెలిచి జడ్పీ చైర్మన్​ అయ్యారు. నా కోసం అడగట్లే.. ప్రజల కోసం అడుగుతున్న. నీకో దండం. మా గ్రామానికి నిధులు ఇప్పియున్రి’’ అని కోరారు. బతుకమ్మ చీరలకు విలువ కట్టవద్దని, అవి సీఎం కానుక అని చెప్పిన జడ్పీ చైర్మన్​ నిధుల ఊసెత్తకపోవడంతో గ్రామస్తులు నిధుల కోసం పట్టుబట్టారు.

ఎల్కతుర్తికి ఎన్ని నిధులు ఇచ్చారో వివరాలు ఇవ్వాలని జడ్పీ చైర్మన్​ అధికారులను ఆదేశించగా.. వివరాలు అందుబాటులో లేవని చెప్పారు. గందరగోళం మధ్యే చీరలు పంపిణీ చేసి జడ్పీ చైర్మన్​ వెళ్తుండగా, తమ గ్రామానికి నిధులు ఇవ్వాలని, ఇలాంటి చీరలకు బదులు నగదు ఇస్తే నచ్చిన చీరలు కొనుక్కుంటామని మహిళలు నినాదాలు చేశారు. నిత్యావసరాలు, కరెంట్ బిల్లులు పెంచి, తక్కువ ధరకు వచ్చే చీరలు ఇస్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రశ్నించిన మహిళలకు చీరలు ఇవ్వొద్దని అధికారులకు చెప్పి జడ్పీ చైర్మన్​ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామానికి నిధులు, నాణ్యమైన చీరలు అడిగితే జడ్పీ చైర్మన్​ చెప్పిన సమాధానం విని ప్రజలు అవాక్కయ్యారు.