ఎల్లారెడ్డి, వెలుగు: ప్రజలు చందాలు వేసి గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్కు అమ్ముడు పోయిన జాజాల సురేందర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావ్ కోరారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్, హాజీపూర్, అడవి లింగాల, జానకంపల్లి, పోసన్ పల్లి, మీసన్ పల్లి, బాలాజీ నగర్ తండా, హాజీపూర్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా కట్టలేదని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు రాలేదన్నారు.
ఎమ్మెల్యే జాజాల ప్రజల కోసం కాకుండా కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్ రాదంటూ గ్రామాల్లో బీఆర్ఎస్ లీడర్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారి ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్పెరుగుతుందే తప్ప, ఇవ్వకపోవడం ఉండదన్నారు.ఎల్లారెడ్డి చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ వాళ్లు కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. ఒక్క రూపాయి జీతం తీసుకొని, మిగతాదంతా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తాననన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలకేంద్రంలో హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యానిట్ల ఉచిత కరెంట్ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గయాజుద్దీన్, సీనియర్ లీడర్లు చెన్న లక్ష్మణ్, వాయిద్, సాయిబాబా, గోపికృష్ణ, సాయిలు పాల్గొన్నారు.