ఏ ప్రభుత్వం వచ్చినా పింఛన్లు ఆగవు : మదన్​మోహన్​రావు

  • వాటిని ఆపే దమ్ము ఎవరికీ లేదు
  • కావాలనే బీఆర్ఎస్ లీడర్లు దుష్ర్పచారం చేస్తున్రు​ 
  • కాంగ్రెస్​ ఎల్లారెడ్డి అభ్యర్థి  మదన్ మోహన్

తాడ్వాయి, వెలుగు: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పింఛన్ల పంపిణీ ఆగదని కాంగ్రెస్​ ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్​మోహన్​రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్​అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతయని బీఆర్ఎస్ లీడర్లు కావాలనే గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారన్నారు.​ అమాయకులను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. మదన్​మోహన్​ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి ప్రజలు రూపాయి రూపాయి చందాలు వేసుకొని జాజాల సురేందర్​ను గెలిపిస్తే, అతడు బీఆర్ఎస్ కు అమ్ముడుపోయాడన్నారు.

ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓటు అడుగుతారని ప్రశ్నించారు. గడిచిన అయిందేండ్లలో కమీషన్ల రూపంలో వందల కోట్లు అక్రమంగా సంపాదించాడన్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధిని గాలికొదిలి, తాను మాత్రం డెవలప్​అయ్యాడన్నారు. రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని, వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్థాయిలో స్టేడియాన్ని నిర్మిస్తానని, తనకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాన్ని పేద ప్రజల అవసరాల కోసం వినియోగిస్తానన్నారు. నియోజకవర్గంలోని పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానన్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేవని, బీఆర్ఎస్ మాత్రం ప్రతీ పథకం తమ కార్యకర్తల కోసమే అన్నట్లు ప్రవర్తించిందన్నారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి లాంటి పథకాల లబ్ధి ఆ పార్టీ కార్యకర్తలకే చేకూరిందన్నారు.  ఇందులోనూ కమీషన్లు తీసుకొని కక్కుర్తి ప్రదర్శించారన్నారు. ఈ అవినీతి ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు.

ఈ సందర్బంగా తాడ్వాయి మాజీ వీడీసీ  చైర్మన్ ధర్మారెడ్డి, కృష్ణాజివాడి ఎంపీటీసీతో పాటు పలువురు లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో అంబీర్ శ్యామ్ రావు, జంగం రాజు, మెట్టు గంగరాజు, ఎల్లయ్య, మల్లయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.