- కార్యకర్తలు సైనికుల్లా పనిచేయండి
- కష్టపడ్డవారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా
- కాంగ్రెస్ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్
ఎల్లారెడ్డి,వెలుగు: రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ రెండు రోజులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కాంగ్రెస్ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్పేర్కొన్నారు. కష్టపడ్డవారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ.. అమ్ముడు పోవడం ఎమ్మెల్యే సురేందర్ కు అలవాటని, తనను ఎవరూ కొనలేరన్నారు.
డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం తనకు లేదని, ఎల్లారెడ్డి అభివృద్ధే లక్ష్యంగా ఇక్కడ బరిలో నిలిచానన్నారు. యువతకు ఉపాధి దొరకక వలస వెళ్తున్నారని, ఎమ్మెల్యే సురేందర్ఎల్లారెడ్డిలో ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని, ప్రజలు తమ ఓటుతో అతడికి బుద్ధిచెప్పాలని కోరారు. తాను లోకల్ లో ఉండనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొదన్నారు. కరోనా టైమ్లో ఎల్లారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు.
కాంగ్రెస్అధికారంలోకి వస్తే పింఛన్ రాదంటూ తప్పడు ప్రచారం చేయడం మానుకోవాలని, లేకుంటే తాము అధికారంలోకి రాగానే తాటతీస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తమ హయాంలో సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎల్లారెడ్డికి బస్ డిపో తీసుకొస్తానన్నారు. సాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని, యువతకు ఉపాధి చూపేందుకు వివిధ కంపెనీలకు తీసుకొస్తానన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామన్నారు.
ఏఐసీసీ అబ్జర్వర్సబాత్ సింగ్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట అని, ఇక్కడి నుంచి మదన్మోహన్ భారీ మెజార్టీతో గెలుస్తారనే నమ్మకం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు చెన్న లక్ష్మణ్, ఆరీఫ్, విద్యాసాగర్, సాయిబాబా, గోపి కృష్ణ , గియాజోద్దీన్, సామెల్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మెనిఫెస్టో
కాంగ్రెస్ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్రావు సోమవారం సొంత మెనిఫెస్టోను విడుదల చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరందిస్తానని, బొంపల్లి, మోతె, కాటివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను ప్రారంభిస్తానన్నారు. నిరుపేదలందరికీ పక్కా ఇల్లు, ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతాన్ని పేదల కోసం ఖర్చు, తాగునీటి సమస్య పరిష్కారం, కొత్త రేషన్ కార్డులు, ప్రతి మండల కేంద్రంలో హెల్ప్ లైన్సెంటర్ల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటు, ఎల్లారెడ్డిలో వంద పడకల ఆస్పత్రి, బస్ డిపో, బోధన్ నుంచి బీదర్ రైలు మార్గం తదితర విషయాలను వివరించారు.