- బలవంతంగా తరలిస్తే గోదావరిలో దూకుతామని హెచ్చరిక
వెల్గటూర్ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫొటోలకు ఫోజు కోసం, పొలాల్లో నాట్లు వేయడానికి టైం ఉంటది కానీ చేగ్యాం ముంపు గ్రామానికి రావడానికి ఎందుకు టైం ఉండడంలేదంటూ ఎల్లంపల్లి ముంపు బాధితులు ఫైర్ అయ్యారు. తాము మూడు సార్లు ఓట్లు వేసి గెలిపిస్తే పట్టించుకోవడంలేదని వాపోయారు. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎల్లంపల్లి ముంపు గ్రామం చేగ్యాం పాత గ్రామంలోని భూ నిర్వాసితులను అధికారులు నూతన ఆర్అండ్ఆర్ కాలనీ లోని స్కూల్ కు తరలించారు.
అయితే 20 రోజులుగా వాళ్లు స్కూల్ లోనే ఉండటంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్కూల్ ను ఖాళీ చేయాలని అధికారులు కోరారు. దీంతో తమకు నష్ట పరిహారం చెల్లించేదాకా స్కూల్ నుంచి కదలమని భీష్మించారు. దీంతో బుధవారం రాత్రి వారిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. రూములలోని వస్తువులు తీయనీయకుండా తాళాలు వేసి బయట కూర్చున్నారు. తమను వెళ్లగొడితే అందరం కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనుతిరిగారు.