ఏం అభివృద్ధి చేసినవని వచ్చినవ్? ఎమ్మెల్యే సురేందర్​ను నిలదీసిన గ్రామస్థులు

ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో వివిధ గ్రామస్థుల నుంచి నిరసన ఎదురైంది. ఏం అభివృద్ధి చేశావని గ్రామానికి వచ్చావంటూ స్థానికులు ఆయనను నిలదీశారు. బుధవారం ఎమ్మెల్యే ఎల్లారెడ్డి  మండలంలోని లక్ష్మాపూర్,అడ్వి లింగల్, హాజీపూర్, కొక్కొండ తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. లక్ష్మాపూర్, అడ్వి లింగల్  గ్రామాల్లో ప్రచారం చేస్తుండగా అభివృద్ధిపై స్థానికులు ఆయనను నిలదీశారు. 

ఎన్నికలు వస్తే తప్ప గ్రామాలకు రావడం లేదని ఆయనపై మండిపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలకు రాకపోయినా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశానని చెప్పారు. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ క్రమంలో గ్రామస్తులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. దీంతో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.