నాగర్‌కర్నూల్, వెలుగు : కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద ఈ వానాకాలం 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. రెండున్నరేండ్ల కింద ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మూడో పంప్ పూర్తిగా దెబ్బతినగా, ఐదో పంప్ ఉపయోగంలో లేకుండా పోయింది. వీటిని రిపేర్ చేయడానికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. పనుల పర్యవేక్షణ బాధ్యత ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డికి అప్పగించారు.
మధ్యలో సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా వర్క్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మూడు పంపులతో పని చేస్తున్నా ఎల్లూరు లిఫ్ట్‌తో నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలోని 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. కనీసం నాలుగు పంపులు నడవకపోతే మూడు ప్యాకేజీల కింద ఉన్న టెయిట్ఎండ్ భూములకు సాగునీరు అందడం కష్టమవుతుంది.
పనులు ముందర పడట్లే..
అక్టోబర్ 2020లో ఎల్లూరు పంప్‌హౌజ్ ప్రమాదానికి గురైం ది. కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. 5 పంపులు ఉండగా, బ్లాస్టింగ్ ధాటికి 3వ పంప్ బేస్ నుంచి పైకి లేచి పంప్హౌస్మునిగింది.19 రోజులు కష్టపడి పంప్‌హౌస్ నుంచి నీటిని తోడేశారు. అప్పటి నుంచి రిపేర్లు నడుస్తూనే ఉన్నాయి. పంప్‌హౌస్, సర్జ్‌పూల్ మధ్యలో 50 మీటర్ల మందంలో ఉండే రాక్ లెడ్జర్‌కు పగుళ్లు వచ్చి నీరు పంప్‌హౌజ్‌లోకి రావడంతో షటర్లు క్లోజ్ చేశారు. పంపులతో పాటు రాక్ లెడ్జర్ పగుళ్ల రిపేర్ పనులను మెగా కంపెనీకి అప్పగించారు. అప్రోచ్ కెనాల్ ముందుభాగంలో హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేసి సర్జ్పూల్పై వరద జలాల ఒత్తిడి లేకుండా చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కాలువలో నీటిని తోడేసి సర్జ్‌పూల్ ముందుభాగంలో ప్రొటెక్షన్ వాల్ నిర్మించి, గేట్లు ఫిట్ చేయాలని ప్రతిపాదించారు.
796 అడుగుల నుంచి 845 అడుగుల ఎత్తులో గోడ, గేట్ల నిర్మాణం అసాధ్యమని వదిలేశారు. కృష్ణా నది నుంచి వరద నీరు ఓపెన్ కెనాల్, అండర్ టన్నెల్ ద్వారా ఎల్లూరు సర్జ్‌పూల్‌లోకి చేరుతున్నాయి. నీటి వేగానికి పంప్‌హౌజ్ గేట్లు దెబ్బతింటున్నాయి. కేఎల్ఐ ప్రాజెక్ట్ డీపీఆర్‌లో నది ముందు భాగంలో హెడ్ రెగ్యులేటర్ నిర్మించి సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌పై వరద ప్రవాహం ఒత్తడి లేకుండా చేయాలని ఉన్నప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేశారు.
దీంతో రెండు సార్లు పంప్‌హౌస్‌లోకి వరద నీరు వచ్చి నీట మునిగింది. అప్పటి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన కంపెనీలకు పనులు అప్పగిస్తున్నా రిపేర్లు మాత్రం కంప్లీట్ కావడం లేదు. రిపేర్లు కంప్లీట్ చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి.
మిషన్ భగీరథ నీటికి కష్టమే..
జొన్నలబొగడ లిఫ్ట్‌లో 4వ పంప్ ఫెయిల్ అయి రెండేండ్లు దాటింది. ఆస్ట్రియా కంపెనీ నుంచి స్పేర్ పార్ట్స్ వస్తే కాని అది పని చేయదు. రెండేండ్లు కరోనా కారణంగా దాన్ని ముట్టుకోలేదు. గుడిపల్లి గట్టులోని ఐదు పంపుల్లో మూడే పని చేస్తున్నాయి. ఇక కల్వకుర్తి లిఫ్ట్‌లో మూడు పంపులతో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథకు నీటిని అందించడం భవిష్యత్‌లో కష్టంగా మారుతుందని ఇంజనీర్లే చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఒక్క పంప్, మోటార్తోనైనా నీళ్లిచ్చామని చెప్పకోవడానికి ప్రభుత్వం ఆరాటపడుతోంది.
ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన నార్లాపూర్ రిజర్వాయర్, మెయిన్ కెనాల్, పంప్‌హౌస్, సర్జ్‌పూల్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు. దీంతో కల్వకుర్తి మెయిన్ కెనాల్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు లింక్ ఇచ్చారు. ఎల్లూరు నుంచి నీటిని తరలించి అక్కడ ఒక్క పంప్ స్టార్ట్ చేయగలిగితే చాలని ఇంజనీర్లు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే కేఎల్ఐ చివరి ఆయకట్టుకు నీళ్లు ఎలా ఇస్తారనే విషయంపై దృష్టి పెట్టడం లేదు.