
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్వి్ట్టర్) సేవలకు సోమవారం (మార్చి 10) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. సైట్లోకి లాగిన్ అయ్యేందుకు ఎక్స్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారా వెల్లడించారు నెటిజన్లు. సేవలకు అంతరాయం కలగడానికి కారణం సైబర్ ఎటాక్ అని ఎక్స్ సిబ్బంది గుర్తించింది. ఈ మేరకు వెంటనే అప్రమత్తమై.. ఎక్స్ సేవలను తిరిగి పునరుద్ధరించింది. పాలస్తీనా అనుకూల సంస్థ డార్క్ స్టార్మ్ టీం ఎక్స్‌పై సైబర్ దాడికి బాధ్యత వహించింది.
ఎక్స్ సేవలకు అంతరాయం కలిగించింది మేమే అని డార్క్ స్టార్మ్ టీం ప్రకటించుకుంది. ఈ క్రమంలో ఎక్స్‌పై జరిగిన సైబర్ దాడిపై ఆ సంస్థ చీఫ్, బిలియనీర్ ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఎక్స్‌పై సైబర్ ఎటాక్ వెనక ఉక్రెయిన్ దేశ హస్తం ఉన్నట్లు ఆరోపించారు ఎలన్ మస్క్.‘‘ఏమి జరిగిందో మాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉద్భవించిన IP అడ్రస్‌తో ఎక్స్ వ్యవస్థను కూల్చివేసేందుకు భారీ సైబర్ దాడి జరిగింది’’ అని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఎలన్ మస్క్ ఈ ఆరోపణలు చేశారు.
ఎక్స్ సేవలను మా టీం తిరిగి పునరుద్ధరించిందని.. ఇప్పుడు ఎలాంటి అవాంతరం లేదని తెలిపారు.శక్తివంతమైన సైబర్ దాడి కారణంగానే సోమవారం ఎక్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ‘‘ప్రతి రోజు ఎక్స్‌పై సైబర్ దాడులు జరుగుతాయి. కానీ సోమవారం జరిగింది భారీ సైబర్ ఎటాక్. దీని వెనక ఒక పెద్ద టీమ్ లేదా ఒక దేశం ఉంది’’ అని మస్క్ పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో ఉక్రెయిన్ తీరును ఎలన్ మస్క్ బహిరంగంగానే తప్పుబట్టారు.
ఉక్రెయిన్ తీరుతో ఈ యుద్ధం సంవత్సరాల తరబడి జరగడం నాకు విసుగు తెప్పించిందన్నారు. అంతేకాకుండా.. తన స్టార్ లింక్ సేవలను ఆపేస్తే యుద్ధంలో ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ కూలిపోతుందని.. ఇది రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తోందని హెచ్చరించారు. ఎలన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన వారం వ్యవధిలోనే అతడి సంస్థ ఎక్స్‌పై సైబర్ దాడి జరగడం.. ఆ ఎటాక్ వెనక ఉక్రెయిన్ ప్రమేయం ఉందని మస్క్ ఆరోపించడం ప్రపంచదేశాల్లో చర్చనీయంశంగా మారింది.