- గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖ అధిపతులుగా ఎంపిక చేసిన ట్రంప్
- మెరుగైన పాలన, వృథా ఖర్చుల తగ్గింపు బాధ్యతలు అప్పగింత
- సీఐఏ చీఫ్గా జాన్ రాట్ క్లిఫ్
వాషింగ్టన్: వచ్చే జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ప్రమాణం చేయనున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కేబినెట్, కార్యవర్గంలోకి తీసుకోనున్న నేతల పేర్లను వరుసగా ప్రకటిస్తున్నారు. తన ప్రభుత్వంలో టెస్లా ఓనర్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (53), ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37)కి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు.
గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖ (డోగ్) అధిపతులుగా వారిద్దరినీ ఎంపిక చేసినట్టు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలనను మెరుగుపర్చడం, వృథా ఖర్చులను నివారించడంపై వారు ప్రభుత్వానికి బయటినుంచి సలహాలు, గైడెన్స్ ఇస్తారని తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4, 2026) నాటికల్లా వారు తమ బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోగ్)కు నాయకత్వం వహించేందుకు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిని ఎంపిక చేశాను. వీరిద్దరూ ఫెడరల్ బ్యూరోక్రసీలో తగిన మార్పులు చేసి, ప్రభుత్వ పాలనా సమర్థతను పెంచుతారని, వృథా ఖర్చులను నివారిస్తారని ఆకాంక్షిస్తున్నా. ఈ బాధ్యతలను వారు విజయవంతంగా నిర్వర్తించి, సేవ్ అమెరికా ఉద్యమానికి ఊతం అందిస్తారని, అమెరికన్ల జీవితాలను మెరుగుపరుస్తారని భావిస్తున్నా” అని ట్రంప్ అన్నారు.
‘‘వీరిద్దరూ జులై 4, 2026లోపు ఈ బాధ్యతలను పూర్తి చేస్తారని.. అమెరికా 250వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ ప్రజలకు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే అమెరికా జాతీయ నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ గా జాన్ రాట్ క్లిఫ్ (59) ను ఎంపిక చేసినట్టు ట్రంప్ ప్రకటించారు. జాన్ ఇంతకుముందు నేషనల్ ఇంటెలిజెన్స్ 6వ డైరెక్టర్ గా, ప్రతినిధుల సభ సభ్యుడిగా పని చేశారు.