ప్రముఖ అమెరికన్ కార్ల కంపెనీ టెస్లా చీఫ్, బిలియనీర్ ఎలన్ మస్క్ యువతకు ఓ సవాల్ విసిరారు. ప్రపంచంలో రోజురోజుకీ కర్బన్ ఉద్గారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని క్యాప్చర్ చేయడానికి బెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేయాలని కోరారు. ఎవరైతే అత్యుత్తమ టెక్నాలజీని అభివృద్ధి చేస్తారో వారికి 100 మిలియన్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.730 కోట్లు) ప్రైజ్ మనీని అందిస్తానని ప్రకటించారు. వాతావరణ మార్పులను తెలుసుకోవడంలో కర్బన ఉద్గారాలను సంగ్రహించడం కీలకంగా మారింది. అయితే కార్బన్ ఎమిషన్స్‌ను బంధించే టెక్నాలజీ ఇప్పటివరకూ అందుబాటులో లేదు. ఆ దిశగా పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.
Am donating $100M towards a prize for best carbon capture technology
— Elon Musk (@elonmusk) January 21, 2021
గాలి నుంచి కార్బన్‌ను తొలగించే కంటే ఉద్గారాలను తగ్గించడంపై ఫోకస్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అన్ని దేశాలు జీరో ఎమిషన్స్ టార్గెట్‌ను చేరుకోవాలంటే కర్బన ఉద్గారాలను బంధించే టెక్నాలజీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని గతేడాది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సూచించింది. ఈ నేపథ్యంలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం తన వంతుగా 100 మిలియన్లను మస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వచ్చే వారంలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.