
2016లో ఎలాన్ మస్క్ స్థాపించిన మరో సంస్థ ‘ది బోరింగ్ కంపెనీ’. అమెరికన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టన్నెల్ నిర్మాణ సేవలు అందిస్తోంది. సిటీ రోడ్ల మీద ఉండే రద్దీని తగ్గించడానికి హై-స్పీడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి హైస్పీడ్ టన్నెలింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి ఈ కంపెనీ పెట్టాడు. మామూలుగా మస్క్‌కి ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తుంటాడు. డిసెంబరు 17, 2016న లాస్ ఏంజెలెస్‌లో మస్క్ కార్‌లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే కార్‌లో నుంచే ఒక ట్వీట్ పెట్టాడు ‘‘ట్రాఫిక్ నన్ను నట్టేట ముంచెత్తుతోంది. అందుకే టన్నెల్ బోరింగ్ మెషిన్‌ని నిర్మించాలి అనుకుంటున్నా” అనేది ఆ ట్వీట్ సారాంశం. కానీ.. ఆ ట్వీట్‌ని అప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు.
ఎందుకంటే.. టన్నెల్‌ని నిర్మించడం అంత ఈజీ కాదు. కానీ.. మస్క్ మామూలు మనుషుల ఆలోచనలకు అందడు. అందుకే వెంటనే కంపెనీ పెట్టేశాడు. దానికి ‘ది బోరింగ్ కంపెనీ’ అనే పేరు పెడుతున్నట్టు ట్వీట్ చేశాడు. జనవరి 2017లో మొదటి టెస్ట్ ‘డిగ్’ని ప్రకటించాడు. ఒక నెల తర్వాత ఫిబ్రవరి 2017లో స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రాంగణంలో బోరింగ్ కంపెనీ పనులు మొదలయ్యాయి. ఒక భూగర్భ టన్నెలింగ్ సిస్టమ్ నిర్మించి పెద్ద నగరాల్లో ట్రాఫిక్‌ని తగ్గించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఇది మూడు ప్రాజెక్ట్‌లను మొదలుపెట్టింది.
లాస్ వెగాస్ నుంచి లాస్ ఏంజిలెస్ మధ్య 51 స్టేషన్లను కలుపుతూ 29-మైళ్ల వెగాస్ లూప్ సొరంగం పనులు పూర్తయ్యాయి. దీని ద్వారా 45 నిమిషాల జర్నీ కాస్తా రెండు నిమిషాల్లో అయిపోతుంది. డౌన్‌టౌన్ చికాగో నుండి ఓ హేర్ ఎయిర్‌పోర్ట్ వరకు హై-స్పీడ్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించే పనులు మొదలుపెట్టింది.
ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే కాదు.. టన్నెలింగ్ వేగాన్ని పెంచడం వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గించొచ్చు.
బోరింగ్ కంపెనీ 2018లో 1.14-మైళ్ల సొరంగాన్ని10 మిలియన్ల డాలర్లతో నిర్మించింది.
స్టార్ లింక్
ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’లో స్టార్‌లింక్ కూడా ఒక భాగంగా ఉంది. ఇది ‘లో ఎర్త్ ఆర్బిట్’ ద్వారా డైరెక్ట్‌గా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడానికి స్పేస్ ఎక్స్ ఇప్పటికే దాదాపు నాలుగువేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపింది. 12,000 ఉపగ్రహాలను పంపాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ కంపెనీ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్‌ని అందిస్తుంది. దీనివల్ల భూమ్మీద ఎక్కడున్నా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. దీనికోసం ‘లో ఎర్త్ ఆర్బిట్’లోకి స్పేస్ ఎక్స్ పంపిన శాటిలైట్లను ఉపయోగిస్తారు. ఈ ఉపగ్రహాలు 550 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ వేగంగా తిరుగుతూ ఉంటాయి. కేవలం 90 నిమిషాల్లోనే ఒక రౌండ్ పూర్తి చేస్తాయి. వినియోగదారుల దగ్గర డీటీహెచ్‌లాంటి ఒక చిన్న డిష్ యాంటెన్నా ఉంటుంది. శాటిలైట్ పంపించే సిగ్నల్‌ను ఈ యాంటెన్నా తీసుకుంటుంది. ఎలాంటి వైర్లు, ఫైబర్ లేకుండానే ఇంటర్నెట్ వస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ బీటా టెస్టింగ్ జరుగుతోంది. అంతేకాదు.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇండియాలో కూడా స్టార్‌లింక్ సేవలు మొదలుపెట్టాలని ఎలాన్ మస్క్ అనుకున్నాడు. కానీ.. దేశంలో స్టార్‌లింక్ ఆపరేట్ చేయడానికి పర్మిషన్ దొరకలేదు. రెండేండ్ల క్రితమే ఆ పర్మిషన్స్ కోసం ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పుడు స్టార్ లింక్ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. డీవోటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్) అధికారులు త్వరలోనే స్టార్‌లింక్‌కు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది.
స్టార్ లింక్ సేవలను ఎక్కడైనా వాడుకోవచ్చు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు కమ్యూనికేషన్ బ్లాకవుట్ అయ్యింది. సిగ్నల్స్ లేక ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అప్పుడు ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ సేవలు వాడుకున్నారు. స్టార్‌లింక్ ఎంట్రీతో ఎయిర్‌టెల్, జియో కూడా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను ప్రారంభించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాయి.