
ఎలాన్ మస్క్ ఈ మధ్యే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ని కొన్నాడు. కొన్న తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సంస్థకు లాభాలు తెస్తున్నాడు. ట్విట్టర్ పేరును కూడా ‘ఎక్స్’గా మార్చేశాడు. అంతేకాదు.. ట్విట్టర్ అనగానే గుర్తొచ్చే బ్లూ బర్డ్ లోగోను తీసేశాడు. దాని స్థానంలో ఎక్స్ లోగో పెట్టాడు. అయితే మస్క్ ట్విట్టర్‌ను ‘ఎక్స్’గా మార్చడం వెనక పెద్ద కారణమే ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ట్విట్టర్ యాప్ ద్వారా అనేక రకాల సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో మస్క్ ఉన్నట్టు చెప్తున్నారు.
పోయినేడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్ల(రూ. 3.59 లక్షల కోట్లు)తో మస్క్ ట్విట్టర్‌ని కొన్నాడు. అప్పటి నుంచి ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను చాలా మార్చాడు. ముఖ్యంగా వెరిఫైడ్ యూజర్స్‌కి ఇచ్చే ట్విట్టర్ బ్లూటిక్ కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్స్ తీసుకోవాలనే రూల్ పెట్టాడు. ఈ మధ్య ట్విట్టర్‌లో కాలింగ్ ఫీచర్‌ని కూడా తేనున్నట్టు చెప్పాడు.
ట్విట్టర్ కథ
ట్విట్టర్‌ను 2006లో జాక్ డోర్సీ, ఇవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్, నోహ్ గ్లాస్ స్థాపించారు. బ్లూ బర్డ్ లోగోను కేవలం15 డాలర్లు పెట్టి ఓ వెబ్ సైట్‌లో కొన్నారు. ఆ తర్వాత దీని డిజైన్ 2009, 2010, 2012లో మూడు సార్లు మారింది. కానీ ఇప్పుడు మస్క్ లోగోను మార్చడంతో ట్విట్టర్ పిట్ట కనుమరుగైంది.