న్యూఢిల్లీ : యాడ్స్ లేకుండా ట్విట్టర్‌ను వాడుకోవాలనుకునే వారి కోసం ఒక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తెచ్చే పనిలో ఎలన్ మస్క్ ఉన్నారు. కానీ, ఇందుకోసం ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ‘యాడ్స్ ప్రతీసారి వస్తుండడం, పెద్దవిగా ఉండడం’ ఈ సమస్యకు రానున్న వారాల్లో పరిష్కారం కనిపెడతాం అని ఆయన ట్వీట్ చేశారు. ఎక్కువ ధరతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తెస్తామని, ఈ ప్లాన్ తీసుకున్నవారికి ఎటువంటి యాడ్స్ కనిపించవని అన్నారు. కాగా, ట్విట్టర్‌కు 90 శాతం రెవెన్యూ డిజిటల్ యాడ్స్ ద్వారానే వస్తోంది. తాజాగా కంపెనీ రెవెన్యూ పడిపోవడానికి కూడా యాడ్స్ తగ్గిపోవడమే కారణం. మస్క్ టేకోవర్ చేసిన తర్వాత నుంచి ట్విట్టర్‌లో చాలా మార్పులు కనిపించాయి.
బ్లూటిక్ మార్క్ కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురావడం, షేర్లు, బిట్‌కాయిన్ల చార్ట్‌లు కనిపించడం వంటివి ఆయన తీసుకొచ్చారు. బ్లూటిక్ మార్క్‌పై యాన్యువల్ ప్లాన్‌ను కూడా తెచ్చారు. ఈ ప్లాన్ కింద బ్లూటిక్ మార్క్‌ను తక్కువ రేటుకే కొనుగోలు చేయొచ్చు. ఈ యాన్యువల్ ప్లాన్ ధర 84 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు, ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు 11 డాలర్లు చెల్లించాలి. బ్లూటిక్ మార్క్ కొన్న కస్టమర్లకు సగం యాడ్సే కనిపిస్తాయని కిందటేడాది ప్రారంభంలో ఎలన్ మస్క్ పేర్కొన్నారు.