ప్రపంచ తొలి ట్రిలియనీర్ గా ఎలన్ మస్క్

ఆయన ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు.. ఇప్పుడు నాలుగు కామాల క్లబ్‌లో మొదటి సభ్యుడు కాబోతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా టెస్లా అధినేత ఎలాన్‌ మాస్క్‌ అవతరించనున్నాడు. టెస్లా కార్లతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎలాన్‌ మాస్క్‌కు ఈ సంపద టెస్లా నుంచి కాకుండా ఆయన 2002లో ప్రారంభించిన స్పేస్‌ ఎక్స్‌ నుంచి వస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా వేస్తోంది.

2020లో అమెరికాలో అత్యంత విలువైన కంపెనీగా టెస్లా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ విలువ దాదాపు 85,000 కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో ఎలాన్‌ మస్క్ కు 20 శాతంపైగా వాటా ఉంది. స్పేస్ ఎక్స్ విలువ ఇపుడు కేవలం 3వేల కోట్ల డాలర్లు మాత్రమే. అంటే స్పేస్‌ ఎక్స్‌ కన్నా టెస్లా 30 రెట్లు అధికమన్నమాట.

మునుముందు స్పేస్‌ ఎక్స్‌ నుంచి ఎలాన్‌ మాస్క్‌కు భారీ ఆదాయం వస్తుందని, కంపెనీ వ్యాల్యూయేషన్‌ భారీగా పెరగనుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలన్ మస్క్  242 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నట్లు అంచనా.